బీజేపీ వంత పాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బ తీస్తోన్నవారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడిన తీరు బాధ కలిగించిందన్న చంద్రబాబు అధికారముందన్న అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్డీఏ సర్కార్ చేస్తోన్న ద్రోహాన్ని మొత్తం దేశం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయమంటే తనపై రాజకీయ ఎదురు దాడి చేస్తున్నారంటూ మోడీపై మండిపడ్డారు చంద్రబాబు. లోక్‌సభలో మోడీ స్పీచ్‌పై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు అసలు ఏపీ అంటే లెక్కే లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆనాడు విభజనకు సహకరించిన బీజేపీ రాష్ట్రానికి న్యాయం చేస్తామని హామీలిచ్చి కూడా మోసం చేసిందన్నారు.
కేంద్రం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ యూటర్న్ తీసుకుందంటూ మోడీ హుందాతనం లేకుండా మాట్లాడారంటూ మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే తాను జాతీయ పార్టీల మద్దతు కూడగడతానన్న పవన్ కల్యాణ్ ఏమైపోయారంటూ ప్రశ్నించారు. ట్విట్టర్లో ఆ ట్వీట్లు ఏంటంటూ సెటైర్లు చేశారు. కేంద్రంపై ధర్మ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో ఎలాంటి రాజీ లేదన్నారు. ఈ పోరాటానికి ప్రజలందరూ సహకరించాలని విజప్తి చేశారు.
ఇంతటి బాధ్యతారాహిత్యమైన కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో తానెప్పుడూ చూడలేదన్న చంద్రబాబు... ఆంధ్రప్రదేశ్‌కు ఎన్డీఏ సర్కార్ చేస్తోన్న ద్రోహాన్ని మొత్తం దేశం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.