టీడీపీ అధినేత చంద్రబాబు స్టైల్ మార్చారు. ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్ధులను ప్రకటిస్తూ వచ్చిన చంద్రబాబు... ఈసారి 8నెలల ముందుగానే బలమైన అభ్యర్ధులను ఇన్‌ఛార్జులుగా నియమిస్తున్నారు. టీడీపీ సంప్రదాయాన్ని పక్కనబెట్టి... వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ముందే అభ్యర్ధులను ప్రకటించే పనిలో పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.... పనితీరు మార్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు.
2019 సార్వత్రిక సమరానికి సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు చంద్రబాబు. ఇప్పటివరకూ పాలనపైనే ఎక్కువ సమయం కేంద్రీకరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... ఎన్నికల కోసం టీడీపీ నేతలను, కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడైనా ప్రజల్లోకి వెళ్లండంటూ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఎమ్మెల్యేల యాక్టివిటీస్‌పై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నచంద్రబాబు... అందరితోనూ వన్ టు వన్ మాట్లాడుతూ... అప్రమత్తం చేస్తున్నారు. పనితీరు సరిగా లేకుంటే మార్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. పనితీరు మార్చుకోకపోతే మీ స్థానంలో మరొకరు వస్తారంటూ తెగేసి చెబుతున్నారు. అంతేకాదు ఎవరెవరు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో ఆధారాలతో సహా చేతిలో పెడుతుండటంతో... ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు.
ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్ధులను ఫైనలైజ్ చేసే చంద్రబాబు ఈసారి రూట్ మార్చారు. ఎన్నికలకు ఇంకా 8నెలల టైమ్ ఉండగానే... వైసీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులను ఇన్‌ఛార్జులుగా నియమిస్తున్నారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే కసరత్తు ప్రారంభించిన చంద్రబాబు... చంద్రగిరి ఇన్‌ఛార్జ్‌గా పులవర్తి నాని పేరును ఖరారు చేశారు. అలాగే పుంగనూరు ఇన్‌ఛార్జ్‌గా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మరదలు.... అనూషరెడ్డి పేరు దాదాపు ఖరారు చేశారు. ఇక ఇటీవల టీడీపీలో చేరిన కొండ్రు మురళీమోహన్‌ను... శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈవిధంగా వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులను ముందుగానే రంగంలోకి దింపుతున్నారు చంద్రబాబు.