తోడబుట్టిన అక్క కోసం తమ్ముడు తొమ్మిదేళ్లు పోరాటం చేశాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్క ఆచూకీ కనిపెట్టేందుకు పెద్ద పరిశోధనే చేశాడు. అక్కే తన ప్రాణంగా భావించే ఈ సోదరుడు తన సోదరి కోసం తల్లిడిల్లిపోయాడు. తన అక్క ఎక్కడుందో తెలుసుకునేందుకు తొమ్మిదేళ్లుగా ఊరారా గాలించాడు. అసలు తన అక్క బతికుందో లేదోనని బంధువులను, తెలిసినవారందరినీ ఎంక్వైరీ చేశాడు.
నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన ఉపేంద్రాచారి కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి ఎల్బీనగర్‌లో నివాసముంటోంది. అయితే 2004లో తన అక్క ప్రియాంక కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్లిందో తెలియదు. అసలు ఏమైందో తెలియదు. దాంతో సోదరి కోసం అల్లాడిపోయాడు. అక్క ఆచూకీ కోసం తొమ్మిదేళ్లుగా వెతుకుతూనే ఉన్నాడు.
అక్క కోసం తొమ్మిదేళ్లుగా గాలిస్తోన్న ఉపేంద్రాచారి పెద్ద పరిశోధనే చేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు వేలమందిని కలిశాడు అక్క ఫొటో పట్టుకుని తెలిసినవారినీ, తెలియనివారినీ అందర్నీ అడిగాడు. సోషల్ మీడియాను కూడా జల్లెడపట్టాడు. చివరికి ఫేస్‌బుక్‌లో తన అక్క ఫొటోలను గుర్తించిన ఉపేంద్రాచారి తన సోదరి ఎక్కడుందో తెలుసుకోవడానికి మరో మూడేళ్లు కష్టపడాల్సి వచ్చింది.
నల్గొండ జిల్లా మర్రిగూడ వాసి హనుమంతును పెళ్లి చేసుకున్నట్లు ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకున్న తమ్ముడు ఉపేంద్రాచారి అక్క కోసం గ్రామానికి వెళ్లి ఎంక్వైరీ చేశాడు. అయితే భర్త చేతిలో అక్క అత్యంత కిరాతకంగా హత్యకు గురైందని తెలుసుకున్న ఉపేంద్రాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉపేంద్రాచారి ఫిర్యాదు మేరకు నిందితుడు హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఇద్దరు పిల్లల్ని అమ్మేసి మరో యువతిని పెళ్లి చేసుకొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఉపేంద్రాచారి ఇంటి పక్కనే నివాసముండే క్యాబ్ డ్రైవర్ హనుమంతు ప్రియాంకను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే సోదరి ప్రేమ విషయం తెలియని ఉపేంద్ర తన అక్క ఆచూకీ కోసం తల్లిడిల్లిపోయాడు. అయితే హనుమంతును ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న ఉపేంద్రాచారి వీళ్ల ఆచూకీ కోసం తీవ్రంగా గాలించాడు. హనుమంతు పేరుతో ఫేస్‌బుక్‌లో గాలించి ఐడీ గుర్తించిన ఉపేంద్ర క్యాబ్ డ్రైవర్ల ద్వారా అడ్రస్‌ను పట్టుకున్నాడు. పలువురు క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడి హనుమంతు ఫోన్ నెంబర్ సంపాదించిన ఉపేంద్రాచారి అతనికి సంబంధించిన మొత్తం సమాచారం సేకరించాడు. హనుమంతు సొంతూరు నల్గొండ జిల్లా మర్రిగూడగా తెలుసుకున్న ఉపేంద్ర అతని ఇంటికెళ్లి అక్క కోసం ఎంక్వైరీ చేశాడు. అయితే అక్క హత్యకు గురైందని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఉపేంద్రాచారి పోలీసులకు సమాచారమిచ్చి నిందితుడ్ని పట్టించాడు.
అక్క కోసం ఓ తమ్ముడు చేసిన పరిశోధన పోలీసులనే ఆశ్యర్చపర్చింది. తొమ్మిదేళ్లుగా ఉపేంద్రాచారి చేసిన గాలింపు, ఎంక్వైరీ తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఉపేంద్రాచారి ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడు హనుమంతును అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియాంక మర్డర్‌పై విచారణ జరుపుతోన్న సీఐ ప్రభాకర్‌రెడ్డిని hmtv సంప్రదించగా ఈ ఘటన 2004నుంచి 2006 మధ్య జరిగిందని తెలిపారు. ప్రస్తుతం నిందితుడు హనుమంతు తమ ఆధీనంలోనే ఉన్నాడన్న సీఐ డెడ్‌బాడీని ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. అయితే భార్యపై అనుమానంతోనే చంపినట్లు తెలుస్తోందన్నారు. ఈ కేసులో విచారణ జరుగుతోందన్న సీఐ ప్రభాకర్‌రెడ్డి త్వరలో మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.
తన అక్క కోసం తొమ్మిదేళ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల వెతికానని చివరకు ఫేస్ బుక్ ద్వారా ఆమె భర్త హనుమంతు ఆచూకీ తెలుసుకున్నానని ప్రియాంక సోదరుడు ఉపేంద్ర తెలిపాడు. hmtvతో ఫోన్లో మాట్లాడిన ఉపేంద్రాచారి హనుమంతు ఇంటికి వెళ్లేసరికి అతను వేరే అమ్మాయితో కలిసి ఉంటున్నాడని ఆరా తీస్తే తన సోదరిని చంపేశాడని తేలిందని కన్నీరుమున్నీరవుతున్నాడు. పోలీసులకు కంప్లైంట్ చేశానంటోన్న ఉపేంద్ర నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు.