ఇందూరు గడ్డ పై కాషాయ జెండా రెపరెపలాడించేందుకు.. కమలనాథులు ప్రత్యేక వ్యూహాం పన్నుతున్నారు. పట్టున్న స్ధానాల్లో గెలుపు కోసం కసరత్తు ముమ్మరం చేశారు. మూడు నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించిన కమలం పార్టీ.. మరో మరో ఆరు స్ధానాల్లో బలమైన అభ్యర్ధుల రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లుగా.. మహారాష్ట్ర- కర్ణాటన బీజేపీ నేతలును రంగంలోకి దింపింది. గత ఎన్నికలకు భిన్నంగా.. ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. నిజామాబాద్ అర్బన్ నియోజవర్గంలో గతంలో బీజేపీ అభ్యర్ధి ఎండల లక్ష్మినారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షునిగా ఉన్న డి. శ్రీనివాస్ ను బీజేపీ అభ్యర్ధి రెండు సార్లు ఓడించారు. అర్బన్ స్ధానంలో బీజేపీకి గట్టి పట్టుఉండగా.. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డిలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తొలి జాబితాలో ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డికి అభ్యర్ధులను ప్రకటించింది. ఆర్మూర్ లో స్ధానిక అభ్యర్ధి పొద్దుటూరి వినయ్ రెడ్డిని ఖరారు చేయగా.. నిజామాబాద్ రూరల్ కు మాజీ ఎంపీ కేశ్ పల్లి గంగారెడ్డి కుమారుడు గడ్డం ఆనంద్ రెడ్డికి మరోసారి టికెట్టు కేటాయించారు. కామారెడ్డి నుంచి మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ వెంకట రమణారెడ్డికి అవకాశం ఇచ్చారు. అర్బన్ టికెట్టు కోసం గట్టి పోటీ ఉండటంతో.. ఇంకా ఎవరిని ఖరారు చేయలేదు. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మధ్య తీవ్ర పోటీ ఉంది.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఐదు నియోజకవర్గాలకు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలను ఇంచార్జీలుగా నియమించింది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాలకు కర్ణాటక నేతలను ఇంచార్జీలుగా నియమించింది. కర్ణాటక-మహారాష్ట్ర బీజేపీ నేతలు క్షేత్రస్ధాయిలో బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలను పర్యావేక్షించనున్నారు. ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. మూడు స్ధానాలకు అభ్యర్ధులు ఖరారు కాగా.. ఆరు స్ధానాల్లో ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. టీఆర్ఎస్- కాంగ్రెస్ అభ్యర్ధులకు దీటైన అభ్యర్ధులను రంగంలోకి దింపి.. 9 నియోజకవర్గాలకు గాను 4 స్ధానాలను తమ ఖాతాలో వేసుకునేలా ప్రణాళికలు సిద్దం చేశారు కమల నాథులు. 9 నియోజకవర్గాలకు గాను మూడ స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం.. మరో వారంలో రెండో జాబితా విడుదలకు సన్నహాలు చేస్తోంది. నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, బాన్సువాడ లలో అధికార - ప్రధాన ప్రతిపక్షానికి దీటైన అభ్యర్ధుల కోసం వేట సాగిస్తున్నారు.
ఎల్లారెడ్డిలో మహిళా అభ్యర్ధిని పోటీలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జుక్కల్, బోధన్ గెలుపు గుర్రాలను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఆ ఆరు నియోజకవర్గాల్లో ఆశావాహుల్లో టికెట్లు ఎవరికి దక్కుతాయోనన్న టెన్షన్ నెలకొంది. ఇందూరు జిల్లాలో నాలుగు స్ధానాల్లో గెలుపే లక్ష్యంగా.. ఆ పార్టీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు జాతీయ స్ధాయి నేతలను ప్రచారానికి రప్పించేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే కమలదళంలో చేరిన పరిపూర్ణనందను ప్రచారానికి రప్పించేలా వ్యూహాం సిద్దం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాం ఇక్కడ అమలు చేసేలా రంగం సిద్దం చేశారు. మరి నాలుగు నియోజకవర్గాలపై కర్ణాటక ఫార్ములా పనిచేస్తుందా.. ? కమల దళానికి ఓటర్లు పట్టం కడాతారా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.