తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం ....

Update: 2018-07-07 12:50 GMT

తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లేకపోవడం ఆ పార్టీకి తీరని నష్టం కలిగిస్తోంది. ప్రజా సమస్యలపై కలిసి పోరాడాల్సిన నాయకులు విభేదాల కారణంగా ఏకతాటిపై నడవలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన నాయకులు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమౌతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది ? నాయకులు కలిసికట్టుగా పోరాటం చేసే ఛాన్సే లేదా ? ‌పార్టీ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఒకరితో ఒకరు కలిసి పనిచేసే వాతావరణమే కరువైంది. ప్రజాసమస్యలపై మూకుమ్మడి పర్యటనలు చేపట్టాల్సిన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయ్యారు. రాష్ట్రంలో చాలా కీలక పరిణామాలు జరుగుతున్నా పట్టనట్టే ఊరుకుంటున్నారు.  మొక్కుబడిగా కొన్ని ప్రకటనలు విడుదల చేయడానికే పరిమితం అవతున్నారు.

 

 నల్గొండ జిల్లాలో ట్రాక్టర్ దుర్ఘటన, వరంగల్ బాణాసంచా పేలుళ్ల ఘటనలు జరిగినప్పుడు పార్టీ నేతలు సరైన రీతిలో స్పందించ లేకపోయారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నపార్టీ స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల చులకన భావం ఏర్పడుతోంది. 

 

 ప్రజా సమస్యలపై స్పందించడంలో వైఫల్యం పక్కనపెడితే.....సొంత పార్టీ నేతలను అధికార పార్టీ ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో కూడా నాయకులు ఎవరూ కలిసిరావడం లేదు. ఇటీవల గద్వాల్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను హౌస్ అరెస్ట్ చేస్తే....పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 

 

 ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తన వైఖరిలో మార్పు తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పార్టీ నాయకులు వ్యవహరిస్తే ఆ పార్టీకి భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News