ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ రిజర్వేషన్లు 34 శాతం కన్నా తగ్గకుండా చూడాలని తెలంగాణ మంత్రి వర్గ ఉప సంఘం తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 50 శాతం కన్నా రిజర్వేషన్లు మించవద్దని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించడానికి సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. దీనిపై కూలంకుశంగా చర్చించిన సబ్‌కమిటీ సుప్రీంకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.
రిజర్వేషన్లపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు బీసీ గణన, పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు, న్యాయ కార్యదర్శి నిరంజన్ రావులతో మంత్రుల సబ్ కమిటీ చర్చించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. ఈ నెలాఖరుతో పాలకవర్గాల పదవీకాలం ముగియనుండటంతో ఈ లోపు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది.
గత పంచాయితీ ఎన్నికల సందర్భంగా 61 శాతం రిజర్వేషన్లను కల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చిందని, ఈసారి కూడా 50 శాతం రిజర్వేషన్లను మించకూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. ఇప్పటికే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కొంతమంది పంచాయతీ ఎన్నికలపై కేసులు వేయడం వల్ల చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రులు చెప్పారు.
అయితే, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 50శాతం రిజర్వేషన్లు కేవలం విద్య, ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తాయని, రాజకీయాలకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోంది. తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లు ఉన్నప్పుడు.. ఇక్కడెందుకు ఉండకూడదన్న వాదనను సుప్రీంకోర్టులో వినిపిస్తామంటోంది. మరి ప్రభుత్వం వాదనలకు ఎంతవరకు బలం చేకూరుతుందో చూడాలి.