కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందా? తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకం వర్గమే రాజ్యమేలుతోందా? వరుసగా బీసీ లీడర్లు.... కాంగ్రెస్‌ను వీడటానికి కారణమేంటి? దానం నాగేందర్ ఆరోపణల్లో అసలు నిజమెంత? తెలంగాణ కాంగ్రెస్ బీసీ లీడర్లు ఏమంటున్నారు?
దానం నాగేందర్... కాంగ్రెస్ పార్టీని వీడుతూ పెద్ద బాంబే వేసి వెళ్లారు. కాంగ్రెస్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, గౌరవం లేని చోట ఎందుకుండటం అంటూ బీసీ లీడర్లలో ఒక ప్రశ్న లెవనెత్తారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేకపోవడం వల్లే డీఎస్, కేకే వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారన్నారు. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాలకు కూడా పార్టీలో తగిన గౌరవం లభించం లేదని వీహెచ్ లాంటి నేతలు పార్టీలో నామ్‌కే వాస్తే అన్నట్టు ఉన్నారన్నారు.
ఇక దానం బాటలోనే మరో బీసీ లీడర్, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కూడా త్వరలోనే కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందని, బీసీ లీడర్లను పట్టించుకోవడం లేదనే ఆరోపణలతోనే ముఖేష్‌గౌడ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అప్రమత్తమైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖేష్ ఇంటికెళ్లి మరీ ఆయన తనయుడు విక్రమ్‌గౌడ్‌తో సమావేశమయ్యారు. అయితే తమను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు పిలవడం లేదని విక్రమ్‌గౌడ్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాము పార్టీ నుంచి వెళ్లిపోయేలా మీరే వ్యవహరిస్తున్నారంటూ ఉత్తమ్‌కి విక్రమ్‌గౌడ్ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలను వీహెచ్ ఖండించారు. బీసీలకు అన్యాయం జరిగితే డీఎస్, కేకే, పొన్నాలతోపాటు తానూ పీసీసీ అధ్యక్షులయ్యేవారమే కాదన్నారు. ఇతర పార్టీల్లో బీసీలకు అధ్యక్ష పదవి ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్‌లో ఒక వర్గం ఆధిపత్యమే ఎక్కువగా ఉంటే పార్టీలో ఉంటూ పోరాడితే బాగుండేదన్నారు. అయితే పార్టీలో క్రిమీలేయర్ పద్ధతిని అమలు చేయాలని పీసీసీ కార్యవర్గ సమావేశంలో డిమాండ్ చేశానన్నారు వీహెచ్.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక వర్గం నేతలే రాజ్యమేలుతున్నారన్న ఆరోపణలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. దాంతో కాంగ్రెస్ నుంచి బీసీ లీడర్లు ఎందుకు వెళ్లిపోతున్నారో అధిష్టానం పరిశీలన చేసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పరిస్థతి ఇలాగే కొనసాగితే... మరికొంత మంది బీసీ లీడర్లు గౌరవం దొరికే పార్టీలోకి వెళ్లిపోతారంటూ హెచ్చరిస్తున్నారు.