సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారా..? వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మోడీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కకుండా చేయాలనే పట్టుదలతో ఉన్నారా..? బీజేపీ యేతర పార్టీలను ఏక తాటిపైకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారా..? బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే అజెండాగా చంద్రబాబు రేపటి ఢిల్లీ పర్యటన జరగబోతోందా..?
జగన్‌పై కత్తితో దాడి..గవర్నర్ నరసింహన్ దాడి ఘటనపై ఏపీ డీజీపీని నివేదిక అడగడం..ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే యత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణల తర్వాత సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. మోడీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత శనివారం ఢిల్లీకి వెళ్ళి జాతీయ మీడియా సాక్షిగా మోడీని ఏకిపడేసిన చంద్రబాబు..పలువురు జాతీయ నేతలను కూడా కలిశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు యూపీ మాజీ సీఎం మాయావతి, లోక్ తాంత్రిక్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్‌తో భేటీ అయ్యి జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి ఏకతాటిపైకి తెచ్చే ప్రయాత్నాలు వేగవతం చేసినట్లు ఆయనే మీడియా సమావేశంలో చెప్పారు. ఇక నుంచి తరుచూ ఢిల్లీకి వస్తుంటానని కూడా స్పష్టం చేశారు.
గత శనివారం హస్తిన పర్యటనలో చెప్పినట్టుగానే చంద్రబాబు... నవంబర్ 1న మరోసారి ఢిల్లీలో పర్యటించబోతున్నారు. గురువారం నాటి పర్యటనలో కూడా చంద్రబాబు వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలను కలుసుకుంటారు. కేంద్రంలో బీజేపీని ఓడించే ఏకైక లక్ష్య సాధనకు స్వల్పకాలిక ప్రయోజనాలు, త్యాగాలకు సిద్ధం కావాలని జాతీయ స్థాయి విపక్ష నేతలకు న్యూఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నచ్చజెబుతారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఐక్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ఢిల్లీకి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబుకు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నిన్న ఫోన్ చేశారు. బీజేపీ యేతర భావజాలం ఉన్న పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలని ఆకాంక్షించిన అఖిలేష్ యాదవ్.. జాతీయ స్థాయిలో ఉన్న పలుకుబడితో పార్టీలను ఏకం చేయాలని చంద్రబాబును అఖిలేశ్ కోరారు. మోడీ నిరంకుశ పోకడల నుంచి దేశాన్ని కాపాడాలననీ.. లౌకికవాదం ప్రమాదంలో పడిందని అఖిలేష్ అన్నారు. మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే చంద్రబాబు ప్రయత్నాలకు సమాజ్‌వాదీ నుంచి సహకారం ఉంటుందని అఖిలేష్ స్పష్టం చేశారు.