ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో తీవ్ర సంచలనమైంది. ఎనిమిదేళ్ల క్రితం కేసులో సడన్‌గా ఎన్బీడబ్ల్యూ ఇష్యూ చేయడంపై తెలుగుదేశం శ్రేణులు అవాక్కయ్యాయి. ఇదంతా కుట్ర అంటూ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ బాబ్లీ ఉద్యమం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. చంద్రబాబుతోపాటు మొత్తం 16మందికి నోటీసులు జారీ చేసిన మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు... ఈనెల 21న విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది.
బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో టీడీపీ పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు... తెలంగాణ సరిహద్దులు దాటి... మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో చంద్రబాబుతోపాటు పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు... నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయితే అప్పట్నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ కేసు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతోపాటు దేవినేని ఉమా మహేశ్వరరావు, గంగుల కమలాకర్, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు, జి.రామానాయుడు, సీహెచ్ విజయరామారావు, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఎస్.సోమోజు, ఏఎస్.రత్నం, పి.సత్యనారాయణ శింభు, టి.ప్రకాష్ గౌడ్, నక్కా ఆనందబాబుకి మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఎనిమిదేళ్లుగా ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఒకేసారి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇంత సడన్‌గా కేసును తవ్వితీయడం వెనుక కుట్ర ఉందంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు నాన్‌బెయిలబుల్ వారెంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.