ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనతో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జాతీయస్థాయిలో కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు యోచన చేసినప్పటికీ, తరువాత కాలంలో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో మారిన రాజకీయాల నేపథ్యంలో చంద్రబాబు ఒక్కసారిగా ఫ్రంట్ ఏర్పాటు యత్నాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు పలువురు నాయకులను కలుసుకొని చర్చించారు. ఆయన కలుసుకుంటున్న నాయకుల జాబితా చూస్తుంటే....తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన కాంగ్రెసేతర కూటమికి జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకుల నుంచి అంతగా మద్దతు లభించే అవకాశం కన్పించడం లేదు. అందుకు కారణం...కాంగ్రెస్ లేని ఫ్రంట్ తో బీజేపీని ఎదుర్కోవడం కష్టమని వివిధ పార్టీల నాయకులు భావించడమే. రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇద్దరు చంద్రులు పోటాపోటీగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఫ్రంట్ ల విషయంలో మాత్రం చంద్రబాబు ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పక తప్పదు.
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటును చంద్రబాబు ముమ్మరం చేశారు. గతంలో ఫ్రంట్ నాయకుడిగా పని చేసిన అనుభవం ఈ సమయంలో ఆయనకు అక్కరకు వచ్చింది. వారం వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేశారు చంద్రబాబు. ఢిల్లీ లో చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ నేత శరద్‌పవార్ ను కూడా ఆయన కలుసుకున్నారు. సీతారాం ఏచూరి, ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్‌తోపాటు మరికొందరు నేతలతో భేటీ అయ్యే అవకాశం కనిప్తోంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన తెలుగుదేశం.... గతంలో రెండు సార్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేసి....నేడు కాంగ్రెస్ తోనే చేతులు కలపాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక విధంగా దేశంలో కాంగ్రెస్ ను విస్మరించలేని పరిస్థితిని స్పష్టం చేస్తోంది.
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పార్టీలను కూడా ఏకతాటి పైకి తీసుకువచ్చేందుకు ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లకు.. కాంగ్రెస్ పార్టీకి మధ్య కొన్ని సమస్యలున్నాయి. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీకీ, వామపక్షాలకు మధ్య విభేదాలున్నాయి. మొదట కలసి వచ్చే పార్టీల నాయకులందరితోనూ సమావేశాలు పూర్తి చేసుకున్న తర్వాత.. ఆయా పార్టీల మధ్య ఉన్న విబేధాలను చక్కదిద్దడంపై చంద్రబాబు దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఇది గనుక విజయవంతమైతే....జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి కూటమి ఏర్పడితే....కొన్ని త్యాగాలు చేసేందుకు....కొంత తగ్గుధోరణితో వ్యవహరించేందుకు కాంగ్రెస్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. కూటమి గనుక ఏర్పడితే....ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని గాకుండా మరొకరిని ఎంచుకునేందుకు కూడా ముందుకు వచ్చింది.
ఉత్తరాదిన కాంగ్రెస్ ఇటీవల బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు అవకాశాలు అంతగా కనిపించడం లేదు. గతంలో కేసీఆర్ ఈ తరహా కూటమి ఏర్పాటుకు కొంత ప్రయత్నించినా, ఆ తరువాత ఆ విషయాన్ని పక్కకు పెట్టేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఈలోగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపున తెలంగాణలో....మరో వైపున జాతీయ స్థాయిలో కూటమి ఏర్పడడం కేసీఆర్ ను కొంత చీకాకు పరిచే అంశమే. వ్యూహాల రూపకల్పనలో మేటి అయిన కేసీఆర్ ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.