బాల్ టాంపరింగ్ వివాదంపై ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తనపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విధించిన నిషేధ నిర్ణయంపై సవాల్ చేయబోనని స్టీవ్ స్మిత్ ప్రకటించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని ఎదుర్కొంటానని తెలిపారు. కెప్టెన్‌గా ఈ వివాదంలో పూర్తి బాధ్యత తీసుకుంటానని ఇంతకుముందే చెప్పాను. ఆ మాటకు కట్టుబాడి ఉన్నాను. నేను ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. నాపై విధించిన ఆంక్షలను సవాల్ చేయడం లేదు. గట్టి సందేశం ఇచ్చే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ చర్యలు తీసుకుంది. వాటిని నేను ఆమోదిస్తున్నాను అని ట్వీట్ చేశాడు.
కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది.
దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్ వార్నర్ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది.
ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్రికెట్ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్ క్రికెట్ ఆడుకునేందుకు అనుమతించింది.
మరోవైపు బాల్ టాంపరింగ్ వివాదంలో హెడ్ కోచ్ డారెన్ లీమన్ పాత్ర లేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ, కోచ్ పదవికి డారెన్ లీమన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు బాల్ టాంపరింగ్ ఘటనలో క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన శిక్ష తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వాళ్లు పాల్పడిన నేరానికి ఈ శిక్ష చాలా ఎక్కువని, అందువల్ల దానిని కాస్త సడలించాల్సిందిగా ఈ ముగ్గురి తరఫు అడ్వైజర్లు సీఏను కోరనున్నారు.