మూడు రాష్ట్రాల ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్‌కు, ఇక ప్రాంతీయ పార్టీలు జేజేలు పలుకుతాయా రాహుల్ నాయకత్వానికి ఓకే అంటాయా అన్ని పార్టీలను కాంగ్రెస్ చెంతకు చేర్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? యూపీలో ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్‌కు ఝలక్ ఇస్తాయా హస్తం కూటమితో చేతులు కలుపుతాయా?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి కీలక పార్టీలన్నీ జారుకుంటున్నాయి. టీడీపీ రాంరాం చెప్పేసింది. శివసేన దాదాపుగా కటీఫ్ చెప్పేసింది. అకాలీదల్ కూడా ఆగ్రహంగా ఉంది. ఎన్డీయేలో ఉన్న మిగతా చిన్నాచితకా పార్టీలు కూడా, ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాయి. ఇలా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒకే జట్టు కట్టేందుకు సిద్దమవుతున్నాయి. బెంగళూరు కుమారస్వామి ప్రమాణస్వీకారమే అందుకు తొలి వేదికైంది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటికీ, ఒక చోట చేర్చేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో తొలిసారి ప్రజాకూటమి పేరుతో రంగంలోకి దిగారు. అయితే ఫలితం రివర్స్ అయ్యింది. కానీ ఐదు రాష్ట్రాల రిజల్ట్స్ వెల్లడికి ఒకరోజు ముందు, అంటే పదో తేదీన ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఏకమై, ఐక్యతను చాటుకున్నాయి. పార్లమెంట్ అనెక్స్ హాల్‌లో జరిగిన మహాకూటమి సమావేశానికి దాదాపు 25 పార్టీల నేతల నేతలు హాజరయ్యారు. అందరిదీ ఒకే మాట.. దేశాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకోవాలి! అందుకు ఒకటే బాట.. మోడీ సర్కారును గద్దెదించాలని నినదించారు.
అయితే ఈ సమావేశానికి ఎస్పీ, బీఎస్పీలు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. నిజానికి బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ఉద్దేశంతో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అయినా అక్కడ కాంగ్రెస్ పైచేయి సాధించింది. కాంగ్రెస్‌కు యూపీలో రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ సీట్లు మాత్రమే ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ పంపిన సంకేతాలను కాంగ్రెస్ ఇప్పటికే తిరస్కరించింది. తాజా విజయాలతో జోరుమీదున్న కాంగ్రెస్.. గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు ఇవ్వకుంటే యూపీలో ఒంటరిగా పోటీచేయడానికీ వెనుకాడకపోవచ్చని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేక పార్టీలతో ఏర్పడే మహాకూటమిలో తనకు 35-40 లోక్‌సభ సీట్లు ఇవ్వాల్సిందేన్న సంకేతాలను ఇప్పటికే బీఎస్పీ పంపింది. 80 ఎంపీ స్థానాల అతిపెద్ద రాష్ట్రం యూపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మాయావతి, ప్రధాని పీఠంపై మనసుపడ్డారు. ఇలా చాలామంది కూటమి నేతలు పీఎం పదవి ఆశిస్తున్నారు. అయితే మూడు రాష్ట్రాల విజయంతో, కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో, రాహుల్ నాయత్వానికి జైకొట్టక తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. పార్లమెంట్్ ఎన్నికలకు నగారా మోగితేనే గానీ, ఎవరు ఏ కూటమిలో ఉంటారో తెలీదు.