ఆధ్యాత్మిక పేరుతో ఆశ్రమాలు...భక్తి ముసుగులతో అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు
తమకు తాము బాబాలుగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక బోధనలు చేశారు. అక్కడితో ఆగని కొంత మంది బాబాలు భక్తి ముసుగులో అత్యాచారాలకు ఒడిగట్టారు. తమనెవరు ఏమీ చేయలేరన్న ధీమాతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఎప్పటికైనా పాపం పండుతుందన్న విషయం గ్రహించలేకపోయారు.
భారతదేశమంటే ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనంత మంది దేవుళ్లు, ఆలయాలు ఒక ఇండియాలో మాత్రమే ఉన్నాయ్. భారత దేశంలో ప్రజలకు భక్తి భావం ఎక్కువ. మనదేశంలో చెట్టును పూజిస్తారు పుట్టను పూజిస్తారు పూవ్వులను పూజిస్తారు పాములను పూజిస్తారు. విభిన్న పద్దతుల్లో దేవుళ్లను కొలిచే సాంప్రదాయం ఇండియాలో ఉంది. ప్రజల భక్తిని ఆసరా చేసుకొని స్వామిజీలు, బాబాలు పుట్టుకొచ్చారు పుట్టుకొస్తూనే ఉన్నారు కూడా.
డేరాబాబా, ఆశారాం బాపులు కూడా భక్తి పేరుతో ఆశ్రమాలు స్థాపించారు. తాము దేవుళ్లమని చెప్పుకుంటూ భక్తులను నమ్మించారు. వివిధ ప్రాంతాల్లో వేలాది మంది భక్తులను తమవైపు తిప్పుకొని ఆశ్రమాలు స్థాపించారు. భక్తి పేరుతో వేల ఎకరాలు ఆస్తులు, కోట్ల కొద్దీ డబ్బు సంపాదించారు. రాజకీయ నేతల అండను సంపాదించుకున్నారు. ఇంకేముంది డేరాబాబా, ఆశారాం బాపులకు తమకు ఎదురే లేదని తమని తాము ఊహించుకున్నారు. భక్తి ముసుగులో వేధింపులకు పాల్పడ్డారు అత్యాచారాలు చేశారు.
డేరాబాబా, ఆశారాం బాపులు తమ ఆశ్రమాల్లో ఎన్నో అనైతిక కార్యకలాపాలకు పాల్పడినా చాలా మంది భక్తులు బయటకు చెప్పుకోలేకపోయారు. శ్రీకృష్ణుడి పేరు చెప్పి డేరా బాబా ఎంతో మంది మహిళల జీవితాలతో అడుకున్నారు. అయితే ఓ బాధితురాలు పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయూర్తి, అప్పటి ప్రధానికి రాసిన లేఖతో గుర్మీత్ రామ్ రహీం సింగ్ పాపం పడింది. బాధితురాలి ఫిర్యాదును సుమోటోగా స్వీకరించిన పంజాబ్, హర్యానా హైకోర్టు డేరా బాబా అకృత్వాలపై విచారణ జరిపి కటకటాల్లోకి నెట్టింది.
డేరాబాబా లాగే ఆశారాం బాపు సైతం తన ఆశ్రమాల్లో ఎన్నో అనైతిక కార్యక్రమాల పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని 16ఏళ్ల బాలికపై 2013లో అత్యాచారానికి పాల్పడటంతో ఆశారాం బాగోతం బయటపడింది. అత్యాచారం కేసు నమోదైన తర్వాత ఆశారాం బాపు అనుచరులు పోలీసులు, జడ్జీలను సైతం చంపేస్తామంటూ బెదిరించారు. పోలీసులు పక్కా ఆధారాలు సేకరించడంతో ఆశారాం బాపు తప్పించుకోలేకపోయారు. ఆశ్రమంలో విశృంఖలంగా వ్యవహరించిన ఆశారాం పాపం చివరికి పండింది. అత్యాచారాలకు పాల్పడ్డ డేరాబాబా, ఆశారాం బాపులు చేసిన నేరాల నుంచి తప్పించుకోలేకపోయారు.