ఒకప్పుడు ప్రాణమిత్రులు.. ఇప్పుడు బద్ధశత్రువులు... ఆసక్తిగా ఆర్మూర్‌ ఆట

Update: 2018-10-25 06:02 GMT

వాళ్లిద్దరూ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు.. తన స్నేహితుని విజయం కోసం పాటు పడిన అప్పటి మిత్రుడు.. ఇప్పుడు ప్రత్యర్ధిగా మారాడు. ఎన్నికల స్ట్రీట్ లో ఢీ అంటే ఢీ అంటున్నాడు. గత ఎన్నికల్లో ప్రత్యర్దిగా ఉన్న మిస్టర్ కూల్ ఇప్పుడు మిత్రునిగా మారి అధికార పార్టీ అభ్యర్ధి విజయానికి నేను సైతం అంటున్నాడు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అయినట్లు.. ఐదేళ్లలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారి.. ఆర్మూర్ ఎన్నికల ముఖ చిత్రాన్నే మార్చేశాయి. ఆర్మూర్ ఎన్నికల బరిలో ఫ్రెండ్స్ తలపడుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ.. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు ప్రత్యర్ధులుగా బరిలో నిలిచారు.

టీఆర్ఎస్ అభ్యర్దిగా తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బరిలో ఉండగా.. 2014 ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయానికి కీలకంగా పనిచేసిన వినయ్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధిగా పోటీకి సై అంటున్నారు. జీవన్ రెడ్డి వర్సెస్ వినయ్ రెడ్డి అన్నట్లుగా ఆర్మూర్ ఫైట్, టఫ్‌గా మారింది. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డికి ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి.. గులాబీ గూటికి చేరారు. దీంతో గత ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా పోటీ చేసిన జీవన్ రెడ్డి- సురేష్ రెడ్డిలు ఇప్పుడు మిత్రులుగా మారగా.. గత ఎన్నికల్లో మిత్రులుగా ఉన్న వినయ్ రెడ్డి- జీవన్ రెడ్డిలు ఇప్పుడు ప్రత్యర్ధులుగా తలపడుతుండటంతో ఆసక్తిగా మారింది. 

ఆర్మూర్ టీఆర్ఎస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి- బీజేపీ అభ్యర్ది వినయ్ రెడ్డి మంచి మిత్రులు. ఇద్దరి భాగస్వామ్యంలో జేవీఆర్ కంపెనీ ఉంది. సదరు కంపెనీ నిర్మాణ రంగంలో మంచి పేరు సంపాదించింది. 2013 ఆర్మూర్‌లో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభ నుంచి.. 2014 ఎన్నికల వరకు టీఆర్ఎస్‌లో వినయ్ రెడ్డి -జీవన్ రెడ్డిలు మంచి ఫ్రెండ్స్‌గా కొనసాగారు. ఆర్మూర్ టీఆర్ఎస్ క్యాడర్ ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఇచ్చారు. ఐతే అనూహ్యంగా వ్యాపార లావాదేవిల్లో విబేధాలు రావడంతో.. ఇద్దరూ దూరమయ్యారు. రాజకీయ ప్రత్యర్ధులుగా మారారు. గతంలో చేసిన అభివృద్ది.. కేసీఆర్ ఛరిష్మా, ప్రభుత్వ పథకాలు మళ్లీ గెలిపిస్తాయని జీవన్ రెడ్డి ధీమాగా ఉండగా.. లోకల్ లీడర్ నినాదం, మోడీ ఛరిష్మా తనను గట్టెక్కిస్తాయంటున్నారు వినయ్ రెడ్డి. 

టీఆర్ఎస్ - బీజేపీ అభ్యర్ధులుగా జీవన్ రెడ్డి వినయ్ రెడ్డిలు ఖరారు కాగా.. కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఆకుల లలిత తానే అభ్యర్దినంటూ ప్రచారం చేస్తున్నా.. మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్ టికెట్ట కోసం పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఎవరికి దక్కినా, ఆర్మూర్‌లో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. మిత్రుల మధ్య ఫైట్ ఎవరిని గట్టెక్కిస్తుంది....ఎవరికి గండంగా మారుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Similar News