ఏపిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. పాలక, ప్రతిపక్షాలు ఎవరికి వారు తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటూ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపద్యంలో లెప్ట్ పార్టీలు తమ కార్యాచరణపై అయోమయ పరిస్తితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని సిపిఎం, సిపిఐ పార్టీలో ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో పడ్డాయి. రెండేళ్ల క్రితం వరకూ వైసీపితో కలిసి ప్రజాపోరాటాలు చేసిన కమ్యునిస్టు పార్టీలు తాజాగా జనసేనానితో కలిసి నడుస్తున్నాయి. వైసీపితో కలిసి చంద్రబాబుని ఓడిస్తామంటూ హడావుడి చేసిన కమ్యూనిస్టులు రాష్ట్రపతి ఎన్నికల అనంతరం వైసీపికి దూరమయ్యారు. నాటి నుంచి జనసేనతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించారు. ఇదే నేపధ్యంలో సిపిఎం, సిపిఐ, జనసేనల కలయికతోనే రాజకీయ ప్రత్యామ్నాయం సాధ్యమంటూ ప్రచారం సాగించారు.
అయితే జనసేనతో పోటీ చేస్తామంటూ లెప్ట్ నేతలు అంటున్నా జనసేన నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కనీసం మాట వరసకు కూడా ఆ పార్టీ నేతలు ప్రకటన చేయలేదు. తాజాగా గత వారంలో రంపచోడవరం పర్యటనలో పవన్ సభలో పాల్గొన్న కమ్యూనిస్టులు పొత్తులపై ప్రకటన వస్తుందని ఆశించారు. అయినా ఎలాంటి ప్రకటన రాకపోగా 2019 ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో పోటీ చేస్తామంటూ జనసేనాని ప్రకటించడం అగ్రనేతలను ఆలోచనల్లో పడేసింది. ఒంటిరిగా పోటీ చేసే పరిస్ధితులు లేకపోవడం, జట్టుకట్టేందుకు మిత్రులు ముందుకు రాకపోవడంతో ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాయి.
ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న తమను పవన్ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఇరు పార్టీల్లోని ఓవర్గం ఆరోపిస్తోంది. పవన్ ప్రతి ఉద్యమానికి తాము మద్ధతిచ్చినా తన కార్యక్రమాల్లో కనీస భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అటు పార్టీకి ఇటు కేడర్‌కు ఇలాంటి పరిస్ధితి మంచిది కాదంటున్నారు. పొత్తులపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ అధినాయకత్వానికి సూచిస్తున్నారు .