ఎన్నికల ఏడాదిలోకి ఎంటరవడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ వారానికి మూడ్రోజులు ప్రజల మధ్యే గడిపేందుకు సిద్ధమవుతున్నారు. పక్కా యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తోన్న చంద్రబాబు గ్రామ దర్శినితో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టడంతో ఇకపై ఎక్కువగా జనం మధ్యే గడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిసైడైయ్యారు. ఇప్పటికే గ్రామ దర్శిని-గ్రామ వికాసం కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబు వారంలో మూడ్రోజులు ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. సోమ, మంగళ, బుధవారాలు సచివాలయంలో ఆదివారం మినహా మిగతా మూడు రోజులు గ్రామదర్శినిలో పాల్గొంటూ జనం మధ్య ఉండనున్నారు.
దాదాపు వంద రోజులపాటు నిర్వహించే గ్రామ దర్శిని కార్యక్రమంతో పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు తెలియజేయనున్నారు. అలాగే ప్రజలతో మమేకమవుతూ అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నారు. ఎన్నికల ఏడాదిలో విపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదనుకుంటోన్న చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. గ్రామ దర్శినితో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.