నేడు ఏపీ కేబినెట్ భేటీ...10లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్లాన్
విభజన హామీల అమలుపై కేంద్రం తీరును నిరసిస్తూ ఈరోజు ఏపీ కేబినెట్ తీర్మానం చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ సుప్రీంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు కౌంటర్ వేయడంపై కీలకం నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న నిరుద్యోగ భృతి విధివిధానాలకు ఆమోదముద్ర వేయనున్నారు. అలాగే విశాఖ మెట్రోరైల్, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, గ్రామదర్శి ప్రోగ్రామ్‌పై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
నిరుద్యోగ భృతి అమలు విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానున్న ఏపీ కేబినెట్ ముఖ్యంగా నిరుద్యోగ భృతి అమలుపై చర్చించనుంది. ఇప్పటికే రెండుసార్లు చర్చించిన మంత్రివర్గం ఇవాళ ఫైనల్ గైడ్‌లైన్స్‌కు ఆమోదం తెలపనుంది. సాధికార సర్వే ఆధారంగా మొదటి దశలో 10లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొదట కనీసార్హత డిగ్రీ అనుకున్నా ఇప్పుడు ఇంటర్ విద్యార్హతతో నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి ఇచ్చేందుకు విధివిధానాలు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఇక విశాఖ మెట్రోరైల్‌కు ఆమోదముద్ర వేయనున్న మంత్రివర్గం త్వరలో టెండర్లు ఖరారుచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పైనా మంత్రివర్గం చర్చించనుంది. కేంద్రం తీరును నిరసిస్తూనే సుప్రీంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపైనా చర్చించనున్నారు. ఇక ఈనెల 16నుంచి ప్రారంభమయ్యే గ్రామదర్శిని కార్యక్రమం విజయవంతం చేయడంపై మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.