ఆ రెండు మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయి..?

Update: 2018-08-11 05:16 GMT

ఏపీ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైందా?.. బీజేపీ మంత్రులు రాజీనామా చేసిన ఖాళీల్లో ఎవరిని నియమించనున్నారు? ఖాళీగా ఉన్న రెండు బెర్త్‌లను భర్తీ చేస్తారా..? లేక ఒక దానితో సరిపెడతారా అన్నదానిపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, కేబినెట్‌లో మైనార్టీలకు చోటు ఉంటుందని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించడంతో పదవిని ఆశిస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ నెల చివర్లో ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరిగితే.. ఆ రెండు మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయి..? 

ఏపీ కేబినెట్‌లో మైనార్టీలను స్థానం కల్పించాల్సిన అవసరం ఉందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి చర్చకు వచ్చింది. బీజేపీ మంత్రులు  కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు రాజీనామాతో ఖాళీ అయిన రెండు స్థానాల్లో ఎవరితో భర్తీ చేస్తారన్న చర్చ ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ మొదలైంది. 

ఈ నెల 28న గుంటూరులో జరగనున్న మైనార్టీ సదస్సు కంటే ముందే మంత్రివర్గ విస్తరణ ఖాయమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవుల్లో ఒకటి ముస్లింలకు కేటాయించొచ్చన్న వార్తలు వినిపిస్తుండటంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రస్తుతం పార్టీలో మైనార్టీ విభాగం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండగా ఎమ్మెల్సీ షరీఫ్ లేదా ఎమ్మెల్యే చాంద్ బాషాకు పదవి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

అలాగే, మరో మంత్రి పదవిని ఎస్సీ వర్గానికి ఇవ్వాలన్న యోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా కేబినెట్‌లో ఎస్టీ వర్గానికి చెందిన వారెవరూ లేకపోవడంతో ఆ దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్టీ వర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావుతోపాటు టీడీపీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. అయితే, వీరిలో గిడ్డి ఈశ్వరి, సర్వేశ్వరరావు వైసీపీ నుంచి రావడంతో  మిగిలిన ఇద్దరిలో ఒకరికి పదవి దక్కే అవకాశం ఉంది. 

అయితే, సీఎం చంద్రబాబు ఒక్కస్థానంతోనే సరిపెడతారా..? లేక ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులు భర్తీ చేస్తారా? లేదా సరిగ్గా పనిచేయని మంత్రులకు శాఖలు మారుస్తారా? అనే అంశాలపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది. శాఖల్లో మార్పులు, చేర్పులు చేస్తే వైద్యారోగ్య శాఖ ఎవరికి అప్పగిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి సీఎం మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పిస్తారో చూడాలి. 

Similar News