ఇంతకీ ఆనం కుటుంబంలో ఏం జరుగుతోంది..?

Update: 2018-07-24 05:58 GMT

నెల్లూరు రాజకీయాలను శాసించిన ఆనం కుటుంబం వివేకా మరణం తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నికల ఏడాది కావడంతో  ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆనం కుటుంబం మళ్లీ రాజకీ యంగా క్రియాశీలకంగా మారుతోంది. వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న ఆనం వెంట ఆయన కుటుంబం మొత్తం నడుస్తుందా? ఆనం వివేకా కుటుంబం కూడా తమ్ముడి వెంట ఉంటుందా? ఇంతకీ ఆనం కుటుంబంలో ఏం జరుగుతోంది..?

సింహపురి రాజకీయ చరిత్రను మలుపుతిప్పిన రాజకీయ కుటుంబాల్లో ఆనం కుటుంబం ఒకటి. దాదాపు ఎనబై ఏళ్లుగా నెల్లూరు జిల్లా రాజకీయాలపై  ఆనం కుటుంబానికి పట్టుంది. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఎరిగిన ఆనం కుటుంబం గత 2014 ఎన్నికల తర్వాత ఎన్నడూ  చూడని సంక్షోభంలో పడింది. ఒకవైపు కుటుంబ రాజకీయ పెద్ద ఆనం వివేకానందారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఇంకో వైపు కవల సోదరులు జయ, విజయ చెరో దారితొక్కారు. వైసీపీలో ఉన్న విజయ్ కుమార్ రెడ్డి  ఇప్పుడు రామ నారాయణరెడ్డి ని రమ్మని ప్రోత్సహిస్తున్నారు మరో సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి మొదట వైసీపీలో చేరినా ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు ఆయన మాజీ మంత్రి ఆదాలకు అనుచరుడు టీడీపీ సంస్థాగత నాయకుల ఎంపికలో జయ- నగర టీడీపీ అధ్యక్ష్య  స్థానానికి పోటీ పడుతున్నారు. ఇక అన్న సోదరుడు  ఏసీ సుబ్బారెడ్డి, రంగమయూర్ రెడ్డులు రామనారాయణరెడ్డి మాట వింటారా లేదా అన్నది ఇప్పుడు ఆ కుటుంబం వెంట ఉన్నవారిలో నెలకొన్ని ఉత్కంఠ.

 2014 ఎన్నికల్లో వివేకానందారెడ్డి తాను ఎన్నికలో పోటీ చేయనని నిర్ణయించుకున్న అనంతరం ఏసీ సుబ్బారెడ్డి  రూరల్ నుంచి బరిలో దిగారు. పరాజయం పాలయ్యారు. రెండో కుమారుడు రంగమయూర్ కార్పోరేటర్ గా కొనసాగుతున్నారు. తండ్రి వివేకానందారెడ్డి రాజకీయ కన్నుసన్నలో మెలిగిన వీరిద్దరూ తమ రాజకీయ భవితవ్యంపై ఎక్కడా పెద్దగా నోరు మెదపలేదు ఇటీవల రామనారాయణరెడ్డి వైసీపీ నేతలతో  భేటీ తర్వాత రంగమయూర్ రెడ్డి  తన చిన్నాన  రామనారాయణరెడ్డితో నడుస్తారనే టాక్ వినిపిస్తోంది. 

ఆనం కుటుంబంలో స్వంత సోదరుల మధ్య ఎక్కడా స్నష్టత కనిపించడంలేదు.. గతంలో ఒకే మాట.. ఒకే బాట అన్నట్లుగా దాదాపు ఇరవై ఏళ్లపాటు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని ఆదిపత్యాన్ని కొనసాగించిన ఆనం కుటుంబం ఇటీవల ఎదురైన ఒడిదుడుకులతో పవర్ పాలిటిక్స్ ముందు కకావికలం అయింది..ఓ వైపు కుటుంబంలో విభేదాలు.. మరో వైపు అధికారం లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఆనం అనుచరవర్గం అంతా చెల్లా చెదురైంది. ఇప్పుడు ఆనం వైసీపీలో చేరితే ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందన్న  అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.

Similar News