ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టు సాధించేందుకు కమలం కసరత్తు చేస్తోంది. గులాబీ కంచుకోటలను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులను కదుపుతోంది. గత ఎన్నికలలో రెండు నియోజకవర్గాలలో ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ... కారు పార్టీ కోటలో కాషాయ జెండా ఎగురవేస్తామంటోంది. జిల్లాలో బోణి కోసం బీజేపీ తహతహలాడుతోంది. బలమైన అభ్యర్థులను రంగంలో దించడానికి వ్యూహరచన చేస్తోంది. గత ఎన్నికలలో ముథోల్ నుంచి రమాదేవి, ఆదిలాబాద్ నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ రెండోస్థానంలో నిలిచారు. ముథోల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి విఠల్‌రెడ్డి చేతిలో రమాదేవిపై కేవలం 8 వేల ఓట్ల తేడాతో ఓడియారు. మంత్రి జోగు రామన్న చేతిలో పాయల శంకర్ 15వేలకు తేడాతో ఓడిపోయారు. ఈసారి గులాబీ అభ్యర్థులను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు బీజేపీ అభ్యర్థులు.
ముథోల్‌లో హిందూ ఓటర్లపై కన్నేసిన బీజేపీ అభ్యర్థి రమాదేవి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. భైంసా పట్టణంలో బీజేపీ, అనుబంధసంఘాలు, హిందూవాహిని సంస్థల మద్దతుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు ఆదిలాబాద్‌లో కూడా పాయల శంకర్ ఒకదఫా ప్రచారం పూర్తి చేశారు. గత ఎన్నికలలో ఓడిపోయిన సానుభూతి ఈసారి కలసి వస్తుందంటున్నారు ఇద్దరు బీజేపీ అభ్యర్థులు. ముథోల్, ఆదిలాబాద్ నియోజకవర్గాలలో గత ఎన్నికలలో బీజేపీ, టీడీపీ పొత్తు ఉండేది. ఈసారి ఒంటరిగా పోటీ చేయడం ఎంత వరకు కలసి వస్తుందన్నదే కమలం పార్టీ ఆలోచన. గతంలో కంటే ఈసారి సర్కార్‌పై వ్యతిరేకత ఉందంటున్న బీజేపీ... అదే తమకు అనుకూలిస్తుందని చెబుతుంది. అయితే ఈ రెండు చోట్ల కాంగ్రెస్ గతంలో కంటే ఎక్కువగానే పుంజుకుంది. ఇదెంత వరకు కలసి వస్తుందో చూడాలి.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో సర్కార్ వ్యతిరేకత అంశాలపై పాయల శంకర్ ఉద్యమిస్తున్నారు. వీటితో పాటు అధికార పార్టీ నుంచి మంత్రి రామన్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుజాత దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ రెండు నియోజకవర్గాలతో నిర్మల్ నుంచి స్వర్ణారెడ్డి బీజేపీలో చేరడంతో మూడు నియోజకవర్గాలు తమవేనంటున్నారు కమలనాథులు. ఈ మూడు నియోజకవర్గాలలో విజయం సాధిస్తామని బీజేపీ పైకి చెబుతున్నా... మైనారీటి ఓట్లు తమకు మైనస్ అవుతాయేమోనన్న అనుమానం లోలోపల వారిని వెంటాడుతుంది.