దేశంలోనే అతి పెద్ద ప్రమాదం... ఆర్టీసీ చరిత్రలోనే మహా విషాదం

Update: 2018-09-12 10:45 GMT

కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణమేంటి..? 57 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమెవరు..? ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే మహా విషాదాన్ని మిగిల్చిందా..? ఘాట్ రోడ్డులో సరైన రక్షణ ఏర్పాట్లు చేయని ఆర్ అండ్ బీ అధికారుల అలసత్వమే కొంపముంచిందా..? అసలు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి బాధ్యులెవరు..? hmtv చేసిన పరిశీలనలో 10 ప్రమాద కారణాలున్నట్లు ‌తేలింది. 

ప్రమాదానికి మొదటి కారణం బస్సులో ఎక్కువ మందిని ఎక్కించడం. కేవలం 40 మంది మాత్రమే ప్రయాణించడానికి అనువైన బస్సులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ 86 మందిని ఎక్కించారు. బస్సు కిక్కిరిసి పోవడంతో దానికి కంట్రోల్ చేయడం డ్రైవర్ వల్ల కాలేదు. 

ఘాట్ రోడ్డులో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం ప్రమాదానికి రెండో కారణం. అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో మలుపుల దగ్గర ప్రమాద సూచికలు ఎక్కడా లేవు. సూచికలు లేని కారణంగా డ్రైవర్‌లో అప్రమత్తత కొరవడింది. 
 
ప్రమాదానికి మూడో కారణం ఘాట్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్లను సూచిస్తూ గుర్తులు లేకపోవడం. ఘాట్ రోడ్డులో మలుపుల దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉన్నా..స్పీడ్ బ్రేకర్‌ను సూచించే గుర్తులు వేయలేదు. స్పీడ్ బ్రేకర్ దగ్గరకు వచ్చాక కానీ దానిని డ్రైవర్ గుర్తించలేకపోయాడు.

బస్సు బ్రేకులు ఫడక పోవడం ప్రమాదానికి నాలుగో కారణం. ప్రమాద సమయానికి ముందు బస్సు బ్రేకులు సరిగా పని చేయలేదని గాయపడిన ప్రయానికులు చెబుతున్నారు. ఘాట్ రోడ్డులో దిగువరకు వేగంగా బస్సు దిగుతున్న సమయంలో మలుపు వచ్చింది. బ్రేకులు సరిగా పడకపోవడంతో మలుపుకు ముందు స్పీడ్ బ్రేకర్ వచ్చినా బస్సు వేగాన్ని నియంత్రించడం డ్రైవర్‌కు కష్టమైంది.

ప్రమాదానికి ఐదో కారణం స్పీడ్ బ్రేకర్‌ను డ్రైవర్ గమనించకపోవడం. స్పీడ్ బ్రేకర్ ను డ్రైవర్ గుర్తించకపోవడంతో బస్పు ఒక్కసారిగా ఎగిరి పడింది. వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ఎగిరి పడడంతో అదుపు తప్పింది.

ప్రమాదానికి ఆరో కారణం ప్రయాణికులు పట్టు తప్పి డ్రైవర్‌ మీద పడటం. స్పీడ్ బ్రేకర్ దగ్గర బస్సు హఠాత్తుగా భారీ కుదుపునకు లోనవ్వడంతో డ్రైవర్ వెనుక కూర్చున్న ప్రయాణికులు, డ్రైవర్ వెనుక నిల్చున్న వారు ఒక్కసారిగా పట్టు తప్పారు. వారంతా ముందుకు తోసుకువచ్చి డ్రైవర్ మీద పడిపోయారు.

 ప్రమాదానికి ఏడో కారణం డ్రైవర్‌ పట్టు తప్పిన స్టీరింగ్. బస్సు కుదుపునకు లోనవ్వడం ప్రయాణికులంతా మీద పడడంతో డ్రైవర్ తన సీటులో నుంచి కదిలిపోయాడు. అదే సమయంలో డ్రైవర్ చేతిలో ఉన్న స్టీరింగ్‌ అతని చేజారింది. మొత్తంగా స్టీరింగ్ డ్రైవర్ పట్టు తప్పడం ప్రమాదానికి కారణమైంది.

ప్రమాదానికి ఎనిమిదో కారణం... బస్సు బోల్తా కొట్టి పల్టీలు కొట్టడం. స్టీరింగ్ డ్రైవర్ చేతి నుంచి పట్టు తప్పగానే బస్సు అదుపు తప్పింది. అక్కడే మలుపు ఉండడంతో బస్సు లోయ వైపునకు పడిపోయింది. 

ప్రమాదానికి 9వ కారణం బస్సు సరైన కండిషన్‌లో లేకపోవడం. కొండగట్టు దగ్గర ప్రమాదానికి గురైన బస్సు..ఫిట్ నెట్ చివరి దశలో ఉంది. వచ్చే నెలతో బస్సు ఫిట్ నెస్ సర్టిఫికెట్ గడువు ముగుస్తుంది. ప్రమాదం జరిగిన విజువల్స్ చూస్తే...బస్సు ఏ మాత్రం కండిషన్‌లో లేనిదని అర్థమవుతోంది.

ప్రమాదానికి పదో కారణం..ఘాట్ రోడ్డు సర్వీస్ రూట్ కాకపోయినా బస్సును నడపడం. నిజానికి శనివారం పేట నుంచి జగిత్యాల వెళ్లడానికి ప్రత్యామ్నయంగా బైపాస్‌ రోడ్డు ఉంది. ప్రమాదం జరిగిన ఘాట్ రోడ్డు మార్గం ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి అనువుగా ఉండదు. ఘాట్ రోడ్డు బదులు బైపాస్ రోడ్డు ను ఉపయోగిస్తే ఐదు కిలో మీటర్లు ఎక్కువ ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఆర్టీసీ అధికారులు డీజిల్‌ ను పొదుపు చేయడానికి షార్ట్‌ కట్‌గా భావించి ప్రమాదకరమైన ఘాట్‌రోడ్డు రూట్‌లోనే బస్సుల్ని నడుపుతున్నారు.

Similar News