వైఎస్‌ విగ్రహంపై వైసీపీలో వివాదమేంటి?

Update: 2019-07-27 04:33 GMT

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్న చందంగా మారింది అనంతపురం జిల్లా ఉరవకొండ లోని వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో వైయస్సార్ విగ్రహ ఏర్పాటు అధికార పార్టీలో చిచ్చు రేపుతోంది. పార్టీలో ముందు నుంచి కొనసాగుతున్న వర్గపోరుకు విగ్రహ వివాదం మరింత ఆజ్యం పోసింది. వైయస్సార్ విగ్రహానికి పోలీసులు పహారా కాయాల్సిన పరిస్థితి నెలకొంది. వైఎస్‌ స్టాట్యూపై వైసీపీలో గొడవెందుకు జరుగుతోంది?

అనంతపురం జిల్లా ఉరవకొండలో ముందు నుంచి వైఎస్ఆర్ సీపీలో రెండు వర్గాలు కత్తులు నూరుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి తొలి నుంచి నియోజక వర్గంలో, నువ్వానేనా అన్నట్టుగా ఆధిపత్యపోరు కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో సీటు కోసం శివరామిరెడ్డి ప్రయత్నించినా, చివరికి విశ్వేశ్వర రెడ్డికే టికెట్ దక్కింది. ఎన్నికల్లో అనూహ్యంగా విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

నియోజకవర్గంలో అన్ని వ్యవహారాల్లో విశ్వేశ్వర్ రెడ్డి, తన మాటే చెల్లబాటు కావాలిన పట్టుదలగా వ్యవహరిస్తారని చెబుతారు. అయితే విశ్వేశ్వర్ రెడ్డికి పోటీగా మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి సైతం తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినా, ఉరవకొండలో ఆ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి పాలవడంతో ఆ పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది. ఇక్కడ పయ్యావుల కేశవ్ గెలుపుకు సానుభూతి ఎంత ఎక్కువగా పని చేసిందో, అంతకంటే ఎక్కువగానే, రెండు వర్గాల కుంపట్లు కేశవ్‌ గెలుపును మరింత సులభం చేశాయని చెప్పాలి. ఆ రేంజ్‌లో వైసీపీలో గ్రూపు తగాదాలున్నాయిక్కడ. ఇప్పుడు ఈ కోల్డ్‌వార్‌‌కు మరింత మంటపెరిగేలా చేస్తోంది వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు.

నాలుగు రోజుల క్రితం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో శివరామిరెడ్డి వర్గీయులు, పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న విశ్వేశ్వర్ రెడ్డి వర్గీయులు ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నారు. తమకు తెలియకుండా విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేశారంటూ, శివరామిరెడ్డి వర్గీయులతో ఘర్షణకు దిగారు. పంచాయతీ అనుమతి తీసుకున్నారా అంటూ నిలదీశారు. మాటామాటా పెరిగి, ఇరువర్గాల మధ్య గొడవ పెరిగింది. ఈ విషయంపై శివ రామ రెడ్డి స్వయంగా పంచాయతీ, పోలీస్ అధికారులతో మాట్లాడి వైయస్ఆర్ విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన నాటి నుంచి వైయస్సార్ విగ్రహానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ఎవరైనా ఆగంతకులు విగ్రహాన్ని తొలగిస్తారని, ఏదైనా ఆటంకం కలిగిస్తారన్న అనుమానంతో పోలీసులు విగ్రహానికి బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. నాలుగు రోజులుగా నిత్యం పంచాయతీ నిర్వహిస్తూ తమ ప్రమేయం లేనిది నియోజకవర్గంలో ఏరకంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని శివరామిరెడ్డిపై రగిలిపోతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తనకు విషయం చెప్పి పనులు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. ఈ విషయంపై శివరామిరెడ్డి వర్గీయులు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, తమ నేత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే అధికారం తమకుందని వాదిస్తున్నారు.

పట్టణంలో నాలుగు రోజులుగా విగ్రహ ఏర్పాటుపై ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలతో అధికారులు, నేతలు చర్చలు జరుపుతున్నప్పటికి ఫలించడం లేదు. ఎవరికి వారు బెట్టు వీడక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. రెండు వర్గాలు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో, ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ సర్కిల్‌లో వైఎస్ ఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఏమిటని టీడీపీ నేతలు మరోవైపు మండిపడుతున్నారు. మూడేళ్ళుగా ఆ స్థలాన్ని ఎన్టీఆర్ విగ్రహానికి కేటాయించారని ఎన్టీఆర్ సర్కిల్ అని పేరు పెట్టి వైఎస్ విగ్రహాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారని ఫైరవుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే అధికార పార్టీలోనే వైఎస్‌ విగ్రహ ఏర్పాటుపై వివాదమేంటని, స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే అధిష్టానం దృష్టిలో పడేందుకు, పార్టీకి విధేయత చూపేందుకే, విగ్రహ వివాదాన్ని వాడుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఉరవకొండలో విశ్వేశ్వర రెడ్డి ఓడిపోవడంతో, ఒకవైపు శివరామిరెడ్డి వర్గం లోలోపల ఖుషీగా ఫీలవుతోంది. ఇదే అదనుగా తన బలాన్ని, విధేయతను చూపించుకోవడానికి రకరకాల ఎత్తులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్థిగా టికెట్ కోసమో, లేదంటే ఏదైనా నామినేటెడ్ పోస్టు కోసమో, అధిష్టానం ప్రసన్నత కోసమో, విగ్రహ ఏర్పాటుపై శివరామిరెడ్డి వర్గం పట్టుదలగా ఉందని, వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అటు విగ్రహాన్ని తన ప్రత్యర్థి వర్గం ఏర్పాటు చేస్తే, ఎక్కడ తాను పలుచన అవుతానేమోనని విశ్వేశ్వరరెడ్డి బెంగపడిపోతున్నారని, స్థానికంగా చర్చించుకుంటున్నారు.

మొత్తం మీద వైఎస్‌ఆర్‌ విగ్రహ ప్రతిష్ఠ అధికార పార్టీలో అగ్గి రాజేసింది. ప్రతిపక్ష నేతలు సైతం, ఎన్టీఆర్‌‌ స్టాట్యూకు కేటాయించిన అంశాన్ని లేవనెత్తుతున్నారు. చివరికి పోలీసులు విగ్రహానికి పహారా కాయాల్సి వస్తోంది. విగ్రహ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Full View

Tags:    

Similar News