Operation HYDRA: హైద్రాబాద్ లో అక్రమ నిర్మాణాలకు హైడ్రాతో గుబుల్

HYDRA in Hyderabad: హైడ్రా అంటే హైద్రాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ .

Update: 2024-08-21 03:30 GMT

Operation Hydra: హైద్రాబాద్ లో అక్రమ నిర్మాణాలకు హైడ్రాతో గుబుల్

హైద్రాబాద్ గండిపేట జలాశయం ఎఫ్ టీ ఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఆగస్టు 18 ఉదయం నుంచి రాత్రి వరకు పలు గెస్ట్ హౌస్ లు, హోటళ్లు, ఫామ్ హౌస్ లు నేలమట్టమయ్యాయి. సంపన్నులు ఎక్కువగా సేదతీరేందుకు ఇష్టపడే ORO, SOS స్పోర్ట్స్ విలేజీల్లోని 12 కట్టడాలు సహా మొత్తం 50 భవనాలను కూల్చారు. గండిపేటే కాదు.... ఆ నెల ఆరంభంలోనూ నగరంలోని పలు చెరువులు, నీటి వనరులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.


 హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు?

హైడ్రా అంటే హైద్రాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ . ఈ ఏడాది జులైలో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అక్రమ నిర్మాణాలపై ఇది పనిచేస్తుంది.

నగరంలోని 2050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 1979 నుంచి 2023 వరకు అంటే 44 ఏళ్లలో నగరంలోని చెరువుల పరిస్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సర్వే నిర్వహించింది. ఈ నివేదికను హైడ్రాకు అందించారు. 50కి పైగా చెరువులు ఆక్రమణలకు గురైనట్టుగా శాటిలైట్ చిత్రాల ఆధారంగా తేలింది.

చెరువులు, పార్కులు, లేఔట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స‌్థలాల ఆక్రమణలను అడ్డుకోవడం హైడ్రా ప్రధాన కర్తవ్యం. హైడ్రాకు సీఎం చైర్మన్ గా ఉంటారు. కమిషనర్ గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ను ప్రభుత్వం నియమించింది.

ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రధానంగా చెరువుల FTL , బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మాణాల కూల్చివేతపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. నిర్మాణాల కూల్చివేత పూర్తైన తర్వాత చెరువుల్లో పూడిక తీస్తారు.

GHMCలో ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ వింగ్ ఉంది. దీన్ని EVDM అని కూడా పిలుస్తారు. ప్రధానంగా విపత్తులకు సంబంధించిన కార్యక్రమాలపై ఈ శాఖ ఫోకస్ చేసేది. జీహెచ్ఎంసీలో అవినీతికి సంబంధించిన ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తే విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగుతుంది.

తాజాగా ఏర్పాటు చేసిన హైడ్రా డిజాస్టర్ తో పాటు ప్రభుత్వ ఆస్తుల రక్షణపై ఫోకస్ చేస్తోంది. హైడ్రా కమిషనర్ కు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేయవచ్చు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టలేదు.


హైడ్రా కమిషనర్ పై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

హైద్రాబాద్ జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లో 1500 గజాల స్థలం పార్క్ స్థలం గ్రీన్ బెల్ట్ గా నిర్ధారిస్తూ ఇక్కడ ఉన్న షాపులను తొలగించి ప్రహరీగోడను మున్సిపల్ అధికారులు నిర్మించారు. అయితే ఈ స్థలం తమదని స్థానికులు ఆందోళనకు దిగారు.

మున్సిపల్ సిబ్బంది నిర్మించిన ప్రహరీగోడను ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే కూల్చివేశారు. ఈ నెల 10న మున్సిపల్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై మరునాడు అంటే ఆగస్టు 11న ఆయన స్పందించారు.

ప్రజా ప్రతినిధిగా ఉన్న నన్ను నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అడ్డుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. ఈ విషయమై అధికారులపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని చెప్పారు. కొందరు అధికారులకు కొన్ని ఉద్యోగాలు చేయడం ఇష్టముండదు... తన లాంటివారిపై కేసులు పెడితే ఇక్కడి నుంచి మరో చోటుకు బదిలీ చేస్తారని అనుకుంటారని పరోక్షంగా హైడ్రా కమిషన్ రంగనాథ్ పై నాగేందర్ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆయన చెప్పారు. అధికారులు వస్తుంటారు.. పోతుంటారు. నేను లోకల్ అంటూ వ్యాఖ్యలు చేశారు.


 దానం కామెంట్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే?

అక్రమ నిర్మాణాలపై చట్టపరంగానే ముందుకు వెళ్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ వివాదానికి సంబంధించి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు లేవన్నారు.

నందగిరి హిల్స్ సొసైటీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని ఆయన తెలిపారు. నందగిరి హిల్స్ సొసైటీ, స్థానిక బస్తీవాసుల మధ్య పంచాయితీ వేరు. దానితో మాకు సంబంధం లేదన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ ఆస్తిని కాపాడామన్నారు.


 చెరువుల రక్షణకు అందరూ ముందుకు రావాలి

చెరువులు, నీటి వనరుల ఆక్రమణలతో జరిగే నష్టంపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. అంతేకాదు ప్రభుత్వాలు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి. ఆక్రమణకు గురైన ఎకరం చెరువును రికవరీ చేస్తే 4 లక్షల లీటర్ల వరద నీటి నుంచి రక్షణ లభిస్తుంది. ఒక్క చెరువు పరిధిలో 6 నుంచి 8 శాతం భూగర్భజలాలు వృద్ది చెందుతాయి.

ఆక్రమణలకు గురైన చెరువులను కాపాడేందుకు రక్షాబందన్ సందర్భంగా ప్రతినబూనాలని ప్రముఖ పర్యవరణవేత్త బీ.వీ. సుబ్బారావు చెప్పారు. చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమార్కులనుంచి హైడ్రా ఏర్పాటు చేయడం స్వాగతించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కు చెందిన ఎస్. శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రాజకీయంగా చిత్తశుద్ది లేకపోతే ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేసినా అంతగా ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

Full View


Tags:    

Similar News