Revanth Reddy: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్
Revanth Reddy: రుణమాఫీ గైడ్‌లైన్స్ రూపొందించడంపై ప్రభుత్వం కసరత్తు
Revanth Reddy: తెలంగాణలో రైతుల రుణమాఫీ గైడ్‌లైన్స్ రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15లోపు రైతుల రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇంకా రెండు నెలల సమయమే ఉండడంతో నిధుల సర్దుబాటు, గైడ్‌లైన్స్ రూపకల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇతర రాష్ట్రాల్లో రైతులకు అందిస్తోన్న పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే వారం రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.
ఈ భేటీలో రుణమాఫీ అంశమే ఎజెండాగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపు తదితర విషయాలపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే రైతులు, రైతు సంఘాల నేతలతో రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సంపన్నులకు రైతు బంధు, రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుంచి అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల్లో తప్పనిసరిగా సీలింగ్ ఉండాలని ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి.