Telegram App ను ఇండియాలో బ్యాన్ చేస్తారా ? సీఈఓ అరెస్టుకు ఆ మిస్టరీ మహిళనే కారణమా?
Telegram App Future in India: టెలిగ్రామ్ యాప్ ఇండియాలో బ్యాన్ కానుందా ? టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెలో దురోవ్ ప్యారిస్‌లో అరెస్ట్ అయిన తరువాత ఇప్పుడు చాలామందిని వేధిస్తోన్న ప్రశ్న ఇది. కేవలం టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్ అయినందుకే ఆ యాప్ బ్యాన్ అవుతుందా అని సందేహం రావచ్చు.. కానీ అతడిపై ఫ్రాన్స్ పోలీసులు నమోదు చేసిన అభియోగాలే ఇప్పుడు ఆ కంపెనీ భవితవ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.
అదేంటంటే.. టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తన కంపెనీ మోడరేషన్ నిబంధనలకు లోబడి నడుచుకోకపోవడం వల్ల చైల్డ్ పోర్నోగ్రఫీ డిస్ట్రిబ్యూషన్, డ్రగ్స్ రవాణా, మనీ లాండరింగ్, అక్కడి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోవడం వంటి నేరాలకి పాల్పడుతున్నట్టుగా ప్యారిస్ పోలీసులు అతడిపై అభియోగాలు మోపుతున్నారు. మన దేశంలో కేంద్ర హోంశాఖ, సమాచార సాంకేతిక శాఖ సైతం టెలిగ్రామ్ సీఈఓ పావెల్‌పై దర్యాప్తు జరుపుతోంది. ఈ అభియోగాలు నిజం అని తేలితే టెలిగ్రామ్ యాప్‌ని నిషేధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లీష్ మీడియాలో వస్తోన్న వార్తా కథనాలు విశ్లేషిస్తున్నాయి.
శనివారం పావెల్ తన ప్రైవేట్ జెట్‌లో అజర్‌బైజాన్ వెళ్లి వస్తుండగా ప్యారిస్ సమీపంలోని లీ బోర్గెట్ ఎయిర్ పోర్టులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పావెల్ అరెస్ట్ అయిన సమయంలో అతడి వెంట ఓ యువతి ఉంది. ఆమె పేరు జూలి వవిలోవా. ఈమె కచ్చితంగా ఎవరు, ఏంటనే వివరాలు ఇప్పటికి ఇంకా బహిర్గతం కాలేదు. అయితే, పావెల్ అరెస్ట్ అయినప్పటి నుండి ఆమె కనిపించకుండాపోయింది. జులి కుటుంబసభ్యులు సైతం ఆమె అదృశ్యంపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
పావెల్ అరెస్టుకి ఆ మహిళే కారణమా ?
టెలిగ్రామ్ సీఈఓ పావెల్ అరెస్ట్ వెనుక జూలి ఉండే అవకాశాలు ఉన్నాయని ఫ్రెంచ్ ప్రైవసీ డేటా రిసెర్చర్ బాప్తిస్ట్ రాబర్ట్ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటే.. జూలీ కూడా పావెల్‌తో కలిసి అజర్‌బైజాన్ వెళ్లారు. ఆమె తన ప్రయాణాన్ని డాక్యుమెంటరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆ వీడియోల్లో పావెల్ కదలికలను ప్యారిస్ పోలీసులు గుర్తించి ఉంటారని రాబర్ట్ అబిప్రాయపడుతున్నారు. ఈ కారణం వల్లే అప్పటికే పావెల్‌పై కన్నేసిన పోలీసులు అతడు ప్యారిస్ తిరిగి రావడంతోనే ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు అనేది రాబర్ట్ వెర్షన్. అందుకే పావెల్ అరెస్ట్ వెనుక ఈ మిస్టరీ యువతి ప్రమేయం ఉండొచ్చనే కథనాలు కూడా వస్తున్నాయి. అది ఆమె తెలిసి చేసిందా లేక తెలియక చేసిందా అనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు.
వాట్సాప్‌కి పోటీగా రష్యాకు చెందిన ఇద్దరు సోదరులు తయారు చేసిన ఈ మెసేజింగ్ యాప్‌కి ఇండియాలోనూ భారీ స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా మొబైల్ యూజర్స్ ఈ టెలిగ్రామ్ యాప్ ఉపయోగిస్తున్నారు. కానీ తాజాగా టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అవడంతో ఆ యాప్ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది.