ట్విట్టర్‌లో భారీ మార్పులకు ఎలాన్ మస్క్ శ్రీకారం.. బ్లూ టిక్ కావాలంటే.. 20 డాలర్లు చెల్లించాల్సిందే
Twitter Blue Tick Price: వారం రోజులుగా ట్విట్టర్ తెగ వార్తల్లో నిలుస్తోంది.
Twitter Blue Tick Price: వారం రోజులుగా ట్విట్టర్ తెగ వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం.. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ కంపెనీని సొంతం చేసుకోవడమే. మొదట్లో డైరెక్టర్లు, సీఈవో, ఉద్యోగుల తొలగింపుపై జోరుగా చర్చ జరిగింది. ఇప్పుడు ట్విట్టర్ మార్పుల విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. ట్వీట్ల సంభాషణల్లో జోరుగా మస్క్ గురించే ప్రస్తావిస్తున్నారు. ట్విట్టర్ ప్రొఫైల్‌లో ఎలాన్ మస్క్ ఏ చిన్న మార్పు చేసినా వైరల్‌గా మారుతోంది. తాజాగా మస్క్ తన ప్రొఫైల్‌లో చీఫ్ ట్వీట్ అన్న ట్యాగ్ చేర్చారు. దీంతో తానే ట్విట్టర్ సంస్థకు సీఈవో అన్న సంకేతాలను ఎలాన్ మస్క్ ఇచ్చారంటూ ట్వీట్టర్ జనాలు చెప్పుకుంటున్నారు.
అనేక వివాదాలు, ఆరోపణలు, విమర్శల తరువాత ట్విట్టర్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోకి ఎలాన్ మస్క్ ఓ సింక్‌ను పట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు.. బయోలో చీఫ్ ట్విట్ అని మార్చేశారు. నిజానికి ఎలాన్ మస్క్‌కు తన ట్విట్టరే తనకు ఫేవరేట్ వెపన్. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారానే ఆయన ఎక్కువగా తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. అవే ఇప్పుడు ఎక్కువగా చర్చకు దారితీస్తున్నాయి. వైన్‌ను వెనక్కి తీసుకురావాలా? అంటూ తాజాగా ఎలాన్ మస్క్ తన ఫాలోవర్లను అడిగారు. వైన్ అనేది ట్విట్టర్‌లోని షార్ట్ వీడియో సర్వీస్ దీనికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. వైన్ సర్వీస్‌పై 60 శాతం మంది ఆసక్తి చూపారు. అంతేకాదు తన గురించి ఏమనుకుంటున్నారని తనే పోల్ నిర్వహించారు. ఇదిలా ఉంటే ట్విట్టర్‌ను మస్క్ టేకోవర్ చేసిన తరువాత అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్ సొంతమైన 24 గంటల్లోనే తన ప్రొఫైల్ బయోను మార్చేశారు. నిజానికి ట్విట్టర్ ప్రొఫైల్‌లో బయోను మారిస్తే అది అప్డేట్ అయ్యేందుకు వారం రోజుల పడుతోంది. కానీ తాజాగా 24 గంటల్లోనే మారుతుందని చూపించారు. బయోలో చీఫ్ ట్వీట్ అని పెట్టుకున్న మస్క్ ఆ తరువాత దాన్ని తొలగించారు. అంటే 24 గంటల్లోనే మార్పులు సాధ్యమని తేల్చి చెప్పారు. తక్షణ మార్పుల విషయంలో ట్విట్టర్ ఎంప్లాయిస్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తరువాత మస్క్ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. అందులో భాగంగా బ్లూ టిక్ వినియోగదారులకు షాక్ ఇవ్వబోతున్నారు. త్వరలోనే పెయిడ్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తారాట. బ్లూ టిక్‌తో పాటు ఇతర అదనపు ఫీచర్లపై ఒక్కో వినియోగదారుడికి నెలకు 19.99 డాలర్లు వసూలు చేయాలని యోచిస్తున్నారట. అంటే మన రూపాయల్లో అయితే.. 16 వందల 50 మేర బాదే అవకాశం ఉంది. నవంబర్ 7లోగా పెయిడ్ వెరిఫికేషన్‌ను ప్రారంభించాలని డెడ్‌లైన్ విధించారట. ప్రస్తుతం ట్విట్టర్‌లో బ్లూటిక్ సహా అదనపు ఫీచర్లను 'ట్విట్టర్ బ్లూ' పేరుతో నెలకు 4.99 డాలర్లకే వినియోగదారులకు అందిస్తున్నారు. ఈ ప్యాక్‌లో ప్రకటనలు లేని ఆర్టికల్స్, ప్రత్యేక రంగుతో ఉండే హోం స్క్రీన్ ఐకాన్ అంతర్భాగంగా ఉంటాయి. ఇకపై ఈ సేవలకు అదనంగా మరో 15 డాలర్లు వసూలు చేయాలని ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను ఆదేశించారు. దీనిలో పెయిడ్ వెరిఫికేషన్‌ను కూడా జోడించి బ్లూటిక్ బ్యాడ్జ్‌ను అందించనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు బ్లూటిక్ మాత్రమే కావాలనుకొనేవారి నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. కానీ, తాజాగా బ్లూటిక్‌ను పెయిడ్ వెర్షన్‌లో భాగంగా చేయడంతో ప్రత్యేకంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ట్విట్టర్‌లో మొత్తం 24 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇందులో 2021 నాటికే 4 లక్షల మంది వెరిఫైడ్ యూజర్లు ఉన్నారు. వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఇచ్చే విషయంలో ట్విట్టర్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది. ట్విట్టర్ వెబ్‌సైట్ ప్రకారం బ్లూ టిక్ విలువైనది. ఈ టిక్ పొందాలంటే నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి. అందరూ గుర్తించబడేలా, ఈ ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా ఉండాలని ట్విట్టర్ నిబంధనలు చెబుతున్నాయి. ఈ విషయంలో పలువురు ట్విట్టర్ తీరుపై విమర్శలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం ప్రాసెస్‌ను ఎలాన్ మస్క్ మార్చేయాలని నిర్ణయించుకున్నారు. బ్లూ టిక్‌ను సబ్‌స్క్రిప్షన్ కింద మార్చేయాలని తాజాగా ట్విట్టర్ ఉద్యోగులకు మస్క్ సూచించినట్టు తెలుస్తోంది. ఈ మార్పుల్లో మొదటిది బ్లూ టిక్ ధరను 5 డాలర్ల నుంచి 20 డాలర్లకు పెంచడం ఇక నుంచి బ్లూ టిక్‌ను తప్పనిసరి సబ్‌స్క్రిప్షన్‌గా మార్చడం రెండోది. 90 రోజుల్లోపు చెల్లింపు చేయకపోతే బ్లూ టిక్‌ను తొలగించేలా చేయడం మూడోది. ఈ మార్పులను ఈనెల 7లోగా చేయాలని ఉద్యోగులకు మస్క్ డెడ్‌లైన్ విధించినట్టు తెలుస్తోంది. అప్పటిలోగా పని పూర్తి చేయకపోతే ఉద్యోగాల కోల్పోతారని వారిని హెచ్చరించారట. అయితే దీనిపై మస్క్ కొన్ని సంకేతాలు ఇచ్చారు. వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పునరుద్దరిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త ఫీచర్ల కోసం నెలకు ఎంత చెల్లించాలని యూజర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా ఉందని ఎలాన్ మస్క్ సమాధానమిచ్చారు.
ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకున్న తరువాత కీలక పదవుల్లో ఉన్న నలుగురిని ఎలాన్ మస్క్ తొలగించారు. ఈ తొలగింపుల్లో సీఈవో పరాగ్ అగర్వాల్ ఒకరు. వారికి కోట్ల రూపాయల జీతాలను చెల్లించడం ఇష్టం లేదని మస్క్ ముందే తేల్చిచెప్పారు. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులను తొలగిస్తారన్న భయం కూడా నెలకొన్నది. 25 శాతం మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. అంతేకాదు మస్క్ సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు. 75 శాతం మంది ఉద్యోగులను తొలగించనని హామీ ఇచ్చారు. ట్విట్టర్ తాజా పరిణామాలతో ఎలాన్ మస్క్ ఏం కోరుకుంటున్నారు? ట్విట్టర్‌ను ఏం చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫ్రీడమ్ స్పీచ్ కోసమే ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్టు గతంలో ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఆ సంస్థను కొనుగోలు చేసిన తరువాత కూడా ఫ్రీబర్డ్ అంటూ ట్వీట్ చేశారు. అదే సమయంలో ట్విట్టర్‌ను ఆదాయ వనరుగా మార్చాలని మస్క్ భావిస్తున్నట్టుగా తాజా నిర్ణయాలతో తెలుస్తోంది. టెస్లా నిధులను ట్విట్టర్‌కు వెచ్చించాని మస్క్ చెప్పడంతో ఆ సంస్థ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ నష్టాలన్నింటినీ కవర్ చేసుకునేందుకు ట్విట్టర్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
యూఎస్ క్యాపిటల్ దాడుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హస్తం ఉందని విద్వేషాలను రగిల్చేలా చేశారంటూ 2021 జనవరిలో ఆయన ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా నిషేధం విధించింది. ఈ విషయంలో ఎలాంటి పునరాలోచన లేదని సంస్థ యాజమాన్యం తేల్చి చెప్పింది. అయితే ట్విట్టర్ మస్క్ చేతికి రావడంతో ఇప్పుడు ట్రంప్‌ను అనుమతిస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇదే ప్రశ్నకు ట్విట్టర్‌లో మస్క్ సమాధానమిచ్చారు. తనకు డాలర్ వస్తుందంటే ట్విట్టర్‌కు భారీగా డబ్బు వస్తున్నట్టే కదా అన్నారు. దీంతో ట్రంప్ అకౌంట్‌ను అనుమతిస్తామన్న సంకేతాలు ఇచ్చారు.