Electric Car: ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?
Electric Car: గ్లోబల్ వార్మింగ్ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది...
Electric Car: గ్లోబల్ వార్మింగ్ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. అయితే సామాన్యుల మనస్సులో అతి పెద్ద భయం ఉంది. అదేంటంటే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ఛార్జింగ్ గురించి. దానికి పట్టే సమయం గురించి ఆందోళన పడుతున్నారు. అమెరికా, చైనాకు చెందిన కొన్ని కంపెనీలు ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి ఎలక్ట్రిక్ వాహనాలకు రెండు రకాలుగా ఛార్జ్ చేస్తారు.
ఒకటి వేగవంతమైన ఛార్జింగ్ దీనికి 60 నుంచి 120 నిమిషాల సమయం పడుతుంది. అంటే దాదాపు ఒకటి నుంచి రెండు గంటలు. రెండోది స్లో ఛార్జింగ్ ఈ ఛార్జింగ్‌లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. పెట్రోల్ పంపు వద్ద తరచుగా రద్దీ కారణంగా మీ కారులో ఇంధనం నింపడానికి మీరు తప్పనిసరిగా 10 నుంచి 12 నిమిషాలు కేటాయించాలి. అయితే గత సంవత్సరం చైనా కంపెనీ GAC 3C, 6Cఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీని అందజేస్తుందని పేర్కొంది. ఈ చార్జర్లతో కేవలం 16 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే ప్రపంచంలోని కొంతమంది ఆటో నిపుణులు దీనిని నమ్మడంలేదు.
ఇంతకుముందు యుఎస్‌లోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు 10 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయగల లిథియం-అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనం పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 480 కి.మీల వరకు వెళుతుందని ప్రచారం కూడా జరిగింది. ఛార్జింగ్ బాధ నుంచి బయటపడిన తర్వాత ప్రజలు వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరిస్తారని నిపుణులు భావిస్తున్నారు. ఛార్జింగ్ సమయాన్ని 10 నుంచి 5 నిమిషాలకు తగ్గించే దిశగా కృషి చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.