BSNL వినియోగదారులకి అలర్ట్.. 4G నెట్‌వర్క్ కోసం ఇదొక్కటి చేయండి..!
BSNL: జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు మార్కెట్‌లో వాటి హవా చూపిస్తున్నప్పటికీ బీఎస్‌ఎన్‌ఎల్ రోజు రోజుకి తన కస్టమర్లని పెంచుకుంటుంది.
BSNL: జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు మార్కెట్‌లో వాటి హవా చూపిస్తున్నప్పటికీ బీఎస్‌ఎన్‌ఎల్ రోజు రోజుకి తన కస్టమర్లని పెంచుకుంటుంది. 2024 జూన్ నాటికి 4G సేవలని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ద్వారా మొదటగా తమిళనాడులో 4G సేవలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం 18 నెలల్లోపు మౌలిక సదుపాయాల నిర్మాణం పూర్తవుతుందని, డిసెంబర్ 2023 నాటికి పరికరాలు, సాఫ్ట్‌వేర్ డెలివరీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
BSNL 4G ముందుగా తమిళనాడుకు
ఇన్‌స్టాలేషన్, ట్రయల్, టెస్టింగ్ దశలు పూర్తయిన తర్వాత జూన్ 2024 నాటికి BSNL 4G సేవ తమిళనాడులో పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. అయితే BSNL ఆదాయానికి గణనీయంగా దోహదపడుతున్న కేరళ దీని తర్వాత 4Gని పొందుతుంది. రాబోయే సేవలను ఆస్వాదించడానికి BSNL తన సేవా కేంద్రాల నుంచి ఉచితంగా 4G సిమ్‌ను పొందాలని వినియోగదారులకి సూచిస్తోంది.
త్వరలో 5G సేవ
BSNL సీనియర్ అధికారి ప్రకారం సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అనేది BSNL వారి 4G సేవను స్వయంచాలకంగా 5Gకి మార్చడానికి అనుమతిస్తుంది. దీంతో 4జీ సర్వీసును ప్రారంభించిన వెంటనే మెరుగైన కనెక్టివిటీతో కూడిన 5జీ సర్వీసును ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ అందించడమే దీని ఉద్దేశం. 4G ప్రారంభించిన వెంటనే BSNL వారి 3G సేవలను నిలిపివేయాలని ముందుగానే ప్రణాళిక వేసింది. అయితే కంపెనీ 2G సేవలను కొనసాగించాలని యోచిస్తోంది. BSNL వారి ఆదాయంలో గణనీయమైన భాగం వాయిస్ కాల్‌ల కోసం బేసిక్ ఫీచర్ ఫోన్‌లపై ఆధారపడే 2G సేవల నుంచే వస్తుంది.