WPL 2025: చిత్తుగా ఓడిన గుజరాత్ జెయింట్స్.. రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్..!
WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 చివరి దశలో ఉంది. ఇప్పుడు ఇందులో టైటిల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 చివరి దశలో ఉంది. ఇప్పుడు ఇందులో టైటిల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ దీనికి ముందు మార్చి 13న ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై జట్టు గుజరాత్‌ను దారుణంగా ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు మార్చి 15న జరిగే ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా గుజరాత్ జట్టు 19.2 ఓవర్లలో 166 పరుగులకు కుప్పకూలింది. 47 పరుగుల తేడాతో ఓటమితో ఛాంపియన్ కావాలనే ఆ టీం కల కూడా చెదిరిపోయింది.
ఆష్లే గార్డనర్ కెప్టెన్సీలోని గుజరాత్ జెయింట్స్ జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశతో మ్యాచ్‌లోకి అడుగుపెట్టింది. కానీ హేలీ మాథ్యూస్ ఒక్కరే మొత్తం జట్టు విజయం బాధ్యతలను తన భుజాల మీదకు ఎత్తుకున్నారు. బ్యాటింగులోనూ, బౌలింగులోనూ రాణించి గుజరాత్ జట్టును ఓడించింది. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హేలీ కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశారు. ఆ తర్వాత బౌలింగ్ చేస్తూ 3.2 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. దీని కారణంగా ఛాంపియన్లుగా ఎదగాలనే గుజరాత్ క్రికెటర్ల కల చెదిరిపోయింది.
హేలీ కాకుండా అమేలియా కార్ 4 ఓవర్లలో 28 పరుగులకు 2 వికెట్లు పడగొట్టింది. షబ్నమ్ ఇస్మాయిల్ 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టింది. నాట్ సెవార్డ్ బ్రంట్ కూడా 4 ఓవర్లు బౌలింగ్ చేసి 31 పరుగులకు 1 వికెట్ తీసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ కూడా బ్యాటింగ్‌లో తమ బలాన్ని చూపించారు. హర్మన్‌ప్రీత్ 12 బంతుల్లో 300 స్ట్రైక్ రేట్‌తో 36 పరుగులు చేసి వేగంగా రాణించింది. తను 4 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టింది. బ్రంట్ 41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 186 స్ట్రైక్ రేట్‌తో 77 పరుగులు చేసింది. వారిద్దరి ఇన్నింగ్స్‌ల కారణంగానే ముంబై 213 పరుగుల స్కోరును చేరుకోగలిగింది.
214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ తొలి ఓవర్లోనే బెత్ మూనీ వికెట్ కోల్పోయింది. దీని తర్వాత, 5వ ఓవర్లో హర్లీన్ డియోల్ కూడా 9 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చింది. ఆరో ఓవర్లో, కెప్టెన్ ఆష్లే గార్డనర్ హేలీ మాథ్యూస్ చేతిలో పడింది. ఆ విధంగా పవర్ ప్లేలో 3 కీలకమైన వికెట్లు కోల్పోయిన తర్వాత, గుజరాత్ ఒత్తిడిలోకి పడింది. మిగిలిన బ్యాట్స్ మెన్ కూడా వెంటవెంటనే అవుట్ అయ్యారు. ఓపెనర్ డేనియల్ గిబ్సన్ 24 బంతుల్లో 34 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్‌లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 20 బంతుల్లో 31 పరుగులు, భారతి ఫుల్మాలి 20 బంతుల్లో 30 పరుగులు అందించారు. వీరు తప్ప మరెవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. క్రమం తప్పకుండా వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. దీని ఫలితంగా మొత్తం జట్టు 166 పరుగులకు ఆలౌట్ అయింది.