IPL 2021, PBKS vs MI: అదిరే విజయం అందుకున్నపంజాబ్ కింగ్స్

IPL 2021, PBKS vs MI: వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరవుతున్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఉపశమనం కలిగింది.

Update: 2021-04-24 02:12 GMT

MI vs PK, Rohit Sharma, IPL 2021:(Twitter) 

IPL 2021, PBKS vs MI: పంజాబ్‌ కింగ్స్‌కు అదిరే విజయం అందుకుంది. ఐపీఎల్ 2021 లో వరుస ఓటములతో ఓటములతో ఉక్కిరిబిక్కిరవుతున్నపంజాబ్ కింగ్స్ కు ఉపసమనం కలిగింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో కలిసికట్టుగా సత్తా చాటిన ఆ జట్టు ముంబయి ఇండియన్స్‌పై 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (63; 52 బంతుల్లో 5×4, 2×6) టాప్‌ స్కోరర్‌. ఛేదనలో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రాహుల్‌ (60 నాటౌట్‌; 52 బంతుల్లో 3×4, 3×6), గేల్‌ (43 నాటౌట్‌; 35 బంతుల్లో 5×4, 2×6) రాణించడంతో లక్ష్యాన్ని పంజాబ్‌ 17.4 ఓవర్లలో ఒకే వికెట్‌ కోల్పోయి అందుకుంది.

ధాటిగా మొదలై..: ఛేదనలో పంజాబ్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ పరుగుల కోసం పోటీపడడంతో పవర్‌ప్లే ఆఖరికి 45/0తో పంజాబ్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో చెరో సిక్స్‌ బాదిన మయాంక్‌, రాహుల్‌ మంచి ఊపు మీద కనిపించారు. అయితే రాహుల్‌ చాహర్‌ (1/19) రంగప్రవేశంతో పరిస్థితి మారిపోయింది. అతడు మయాంక్‌ను ఔట్‌ చేయడంతో ముంబయి పోటీలోకి వచ్చింది. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ వేగంగా ఆడలేకపోయారు. విధ్వంసక బ్యాట్స్‌మన్‌ గేల్‌ కూడా ఆరంభంలో బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. కానీ రాహుల్‌, గేల్‌ గేరు మార్చి రన్‌రేట్‌ను అదుపులోకి తెచ్చారు. సమీకరణం 42 బంతుల్లో 50 పరుగులుగా ఉన్న దశలో రాహుల్‌, గేల్‌ చెరో సిక్స్‌ బాదడంతో పంజాబ్‌పై ఒత్తిడి తొలగిపోయింది. చివరి మూడు ఓవర్లలో 17 పరుగుల అవసరమైన స్థితిలో గేల్‌, రాహుల్‌ మరోసారి బ్యాట్‌ ఝుళిపించడంతో పంజాబ్‌ ఛేదన పూర్తపోయింది.

నెమ్మదిగా ఆడి..: అంతకుముందు ముంబయి ఇన్నింగ్స్‌ చూస్తే ఆడుతోంది టీ20నా లేక టెస్టు మ్యాచా అన్న అనుమానం కలిగింది.. 5 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 17 పరుగులే. 4.5 ఓవర్ల వరకు ముంబయి బౌండరీనే కొట్టలేకపోయింది. పవర్‌ ప్లే ఆఖరికి రన్‌రేట్‌ నాలుగు లోపే. రెండో ఓవర్లోనే డికాక్‌ (3)ను హుడా ఔట్‌ చేశాడు. ఉన్నంతసేసూ ఏమాత్రం సౌకర్యంగా కనిపించని ఇషాన్‌ కిషన్‌ (17 బంతుల్లో 6) కూడా ఇక బ్యాట్‌ ఝుళిపిస్తాడేమో అనుకున్న సమయంలో రవి బిష్ణోయ్‌కి దొరికిపోయాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఈ లెగ్‌స్పిన్నర్‌ తన తొలి ఓవర్లోనే ఈ వికెట్‌ సాధించాడు. మరోవైపు ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్లోనే సమీక్ష కోరి వికెట్‌ కాపాడుకున్న కెప్టెన్‌ రోహిత్‌.. తన షాట్లు కొట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. అలెన్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో ముంబయి కెప్టెన్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డులో కాస్త చలనం తీసుకొచ్చాడు. కుదురుకున్నాక తన శైలిలో లెగ్‌సైడ్‌ సిక్స్‌లతో స్కోరు పెంచాడు. సూర్యకుమార్‌ (33)తో అతను విలువైన భాగస్వామ్యాన్ని (నాలుగో వికెట్‌కు 79 పరుగులు) నెలకొల్పాడు.

ఈ క్రమంలోనే రోహిత్‌ 40 బంతుల్లో అర్ధసెంచరీ మార్కు అందుకున్నాడు. సూర్య కూడా కొన్ని మెరుపు షాట్లు ఆడడంతో ముంబయి 14 ఓవర్లకు 88/2తో కోలుకుంది. ఆ తర్వాత రోహిత్‌, సూర్య జోరు చూస్తే ఆ జట్టు మెరుగైన స్కోరే చేసేలా కనిపించింది. కానీ వరుస ఓవర్లలో రోహిత్‌, సూర్యతో పాటు హార్దిక్‌ పాండ్య (1), కృనాల్‌ (3) వికెట్లు కోల్పోయిన ముంబయి అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. చివరి నాలుగు ఓవర్లలో ఆ జట్టు 26 పరుగులే సాధించగలిగింది. పంజాబ్‌ బౌలర్లలో షమి (2/21), రవి బిష్ణోయ్‌ (2/21), హుడా (1/15) ప్రత్యర్థికి కళ్లెం వేశారు.



Tags:    

Similar News