PKL 2024 Auction: కబడ్డీ ఆటగాళ్లపై రూ. కోట్లు కుమ్మరించిన ఫ్రాంఛైజీలు.. ఈ సారి సైతం అమ్ముడు పోని రాహుల్ చౌదరి
కూతతో పాయింట్ల మోత మోగించే రైడర్లపై... ట్యాక్లింగ్‌తో ప్రత్యర్థిని పట్టేసే డిఫెండర్లపై.. రెండు విభాగాల్లోనూ సత్తాచాటే ఆల్‌రౌండర్లపై కోట్ల వర్షం కురిసింది.
Pro Kabaddi 2024: ఇంతింతై అన్నట్లు ఎదిగిన ప్రొ కబడ్డీ లీగ్ ఆటగాళ్లపై కోట్ల రూపాయలు కుమ్మరించింది. ప్రతి గడపకు చేరువైన ప్రొ కబడ్డీ లీగ్‌కు ఆదరణ పెరిగినట్లుగానే.. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు వెచ్చించే ధర కూడా పెరుగింది. ఈ ఏడాది 11వ సీజన్ ఆరంభం నేపథ్యంలో నిర్వహించిన వేలంలో ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు కోట్ల రూపాయలు కురిపించాయి. లీగ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి 8 మంది ఆటగాళ్లు కోటీశ్వరులయ్యారు. రెండు రోజుల పాటు సాగిన వేలంలో సచిన్ తన్వార్ అత్యధిక ధర దక్కించుకున్నాడు. 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
కూతతో పాయింట్ల మోత మోగించే రైడర్లపై... ట్యాక్లింగ్‌తో ప్రత్యర్థిని పట్టేసే డిఫెండర్లపై.. రెండు విభాగాల్లోనూ సత్తాచాటే ఆల్‌రౌండర్లపై కోట్ల వర్షం కురిసింది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. గురు, శుక్రవారాల్లో సాగిన ఈ వేలంలో 12 ఫ్రాంఛైజీలు కలిపి 118 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. పీకేఎల్ చరిత్రలోనే తొలిసారి ఓ వేలంలో ఎనిమిది మంది ఆటగాళ్లు కోటికి పైగా దక్కించుకున్నారు. ఈ వేలంలో రైడర్ సచిన్ తన్వార్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు.
అతని కోసం తమిళ్ తలైవాస్ 2.15 కోట్ల రూపాయలు వెచ్చించింది. 2.07 కోట్లు దక్కించుకున్న ఇరాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్‌రెజా చియానె లీగ్ చరిత్రలో ఎక్కువ మొత్తం సొంతం చేసుకున్న విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. చియోన్‌ను హరియాణా స్టీలర్స్ దక్కించుకుంది. వరుసగా రెండో వేలంలోనూ 2 కోట్ల రూపాయలకు పైగా ధర పలికిన తొలి విదేశీ ఆటగాడూ అతడే. రైడర్లు గుమన్ సింగ్‌ను గుజరాత్ జెయింట్స్ 1.97 కోట్లకు, మణిందర్ సింగ్‌ను బెంగాల్ వారియర్స్ 1.15 కోట్లకు, అజింక్య పవార్‌ను బెంగళూరు బుల్స్ 1.107 కోట్లకు, ఆల్‌రౌండర్ భరత్‌ను యూపీ యోధాస్ 1.30 కోట్ల రూపాయల వెచ్చించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగిన రాహుల్ చౌదరి ఈసారి సైతం అమ్ముడుపోలేదు. గుజరాత్ జెయింట్స్ అత్యధికంగా 15 మందిని, తమిళ తలైవాస్ అత్యల్పంగా నలుగురు ఆటగాళ్లను తీసుకున్నాయి. 11వ సీజన్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.