India Vs England Test Series - Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ హైదరాబాదీ కుర్రాడు.. తన బౌలింగ్ ప్రతిభతో గల్లీ నుండి ప్రపంచ స్థాయి క్రికెటర్ గా ఎదిగి భారత జట్టు బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ క్రికెటర్ . ఐపీఎల్ లో బెంగుళూరు జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన సిరాజ్ తన పదునైన బౌలింగ్ తో జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ నుండి టీమిండియా జట్టులో ఫాస్ట్ బౌలర్ గా స్థానం సంపాదించిన సిరాజ్ తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తన బౌలింగ్ తో ఇంగ్లాండ్ ఆటగాళ్ళకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్ వికెట్ తీసిన ప్రతిసారి బ్యాట్స్ మెన్ వైపు చూస్తూ పెదవులపై వేలు పెట్టుకుని మౌనంగా వెళ్లిపోవాలని సైగ చేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇలా చేయడంపై పలువురు సిరాజ్ లాంటి యంగ్ ప్లేయర్ ఇప్పటి నుండే ఇలా ప్రవర్తించడం తప్పని తనకి మంచి భవిష్యత్తు ఉందని సలహాలు ఇస్తుండగా మూడో రోజు ఆట ముగిసిన తరువాత మీడియా సమావేశంలో పాల్గొన్న సిరాజ్ తను అలా చేయడానికి గల కారణాలను మీడియాతో పంచుకున్నాడు. తన ఆటపై కొంతమంది చేసిన విమర్శకుల కోసం మరియు తనని ద్వేషించే వాళ్ళ కోసమే తాను అలాంటి సెలబ్రేషన్ చేసుకుంటానని, నా బంతితోనే నన్ను ద్వేషించే వాళ్లకు సమాధానం చెబుతానని సిరాజ్ చెప్పుకొచ్చాడు. మొదటి టెస్ట్ లో సిరాజ్ మరియు షమీలపై కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.