IPL 2020 Updates : రాహుల్ శతకం దెబ్బకు బెంగళూరు కకావికలు!

IPL 2020 Updates: ఐపీఎల్ 2020 లో బెంగళూరు జట్టుకు ఘోర పరాభవ అపజయం!

Update: 2020-09-24 18:29 GMT

KL Rahul

ఒక్కడు చేసిన పరుగులు..అవతలి జట్టులో పదిమందీ కలిసి చేయలేకపోయారు. ఇదొక్కటి చాలు పంజాబ్ ఆట తీరును చెప్పటానికి. పూర్తిగా ఇది రాహుల్ షో. రాహుల్ ఇచ్చిన స్కోరుతో.. బౌలింగ్ ఫీల్డింగ్ లలో ఎక్కడా తడబడ కుండా విజయం సాధించింది పంజాబ్ జట్టు. రాహుల్ మెరుపులకు.. బౌలర్ల చక్కని ప్రదర్శన పంజాబ్ విజయాన్ని నల్లేరుపై నడకలా మార్చేశాయి. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసి 217 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు ముందుంచిన పంజాబ్ జట్టు.. తరువాత ఆ జట్టును 109 పరుగులకు ఆలౌట్ చేసి 97 పరుగుల భారీ ఆధిక్యం తో ఘన విజయం సొంతం చేసుకుంది.

బెంగళూరు బ్యాటులెత్తేసింది ఇలా..

వికెట్ నెంబర్ 1.. దేవ్‌దత్‌ పడిక్కల్‌

మొదటి ఓవర్ లోనే బెంగళూరుకు షాక్‌! గత మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్న దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగుకే ఔటయ్యాడు. షెల్డన్‌ కాట్రెల్‌ వేసిన ఈ ఓవర్‌లో అతడు రవిబిష్ణోయ్‌ చేతికి చిక్కాడు.

వికెట్ నెంబర్ 2.. జోష్‌ ఫిలిప్‌ డకౌట్!

రెండో ఓవర్ లో మహ్మద్‌ షమి వేసిన రెండో బంతికి వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ జోష్‌ ఫిలిప్‌(0) ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో కోహ్లీసేన 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

వికెట్ నెంబర్ 3.. కెప్టెన్ కోహ్లీ!

మూడో ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు కోహ్లీ.. ఈ వికెట్ షెల్డన్ కాట్రెల్ ఖాతాలో చేరింది. దీంతో 3 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 5/3గా నమోదైంది.

* ఇక్కడ నుంచి వికెట్ల పతనం కొద్దిగా ఆగింది. ఫించ్ కు జతగా దివిలీర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ను పునర్నిర్మించే పనిలో పడ్డాడు. ఇద్దరూ దొరికిన బంతిని బాదుతూ..చెత్త బంతుల్ని వదిలేస్తూ స్కోరు బోర్డును కదిలించారు.. కుదురుకుంటున్న ఈ జోడీని బిష్ణోయ్ విడదీశాడు.

వికెట్ నెంబర్ 4.. ఆరోన్‌ ఫించ్‌!

20 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్ రవి బిష్ణోయ్ వేసిన 8 వ వోవర్ లో కీపర్ కు చిక్కాడు. దీంతో బెంగళూరు 53 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

వికెట్ నెంబర్ 5.. డివిలియర్స్‌!

ఫించ్ అవుతయ్యకా డివిలియర్స్ తరువాతి ఓవర్ లోనే వికెట్ సమర్పించుకున్నాడు. అశ్విన్ బౌలింగ్ లో 9 వ ఓవర్ రెండో బంతికి డివిలియర్స్ పెవిలియన్ చేరాడు. దీంతో 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది బెంగళూరు

* మళ్ళీ వికెట్లకు కాస్త విరామం మూడు ఓవర్ల పాటు వికెట్ పడకుండా శివం దూబే, వాషింగ్టన్ సుందర్ జాగ్రత్తగా ఆడారు. అవకాశం దొరికినపుడు పరుగులూ తీశారు.

వికెట్ నెంబర్ 6.. శివం దూబే..

ఓ సిక్స్ కొట్టి ఊపుమీద ఉన్న శివం దూబే అదే ఊపులో మాక్స్‌వెల్‌ వేసిన 13వ ఓవర్‌లో బౌల్డయ్యాడు. అప్పటికి బెంగళూరు స్కోరు 83/6.

వికెట్ నెంబర్ 7..ఉమేష్ యాదవ్!

రవిబిష్ణోయ్‌ వేసిన 14వ ఓవర్‌ చివరి బంతికి బెంగళూరు ఏడో వికెట్‌ కోల్పోయింది. ఉమేశ్‌ యాదవ్‌(0) బౌల్డయ్యాడు. 14 ఓవర్లకు బెంగళూరు స్కోర్‌ 88/7గా నమోదైంది.

వికెట్ నెంబర్ 8.. వాషింగ్టన్‌ సుందర్‌

రవిబిష్ణోయ్‌ వేసిన 16వ ఓవర్‌లో బెంగళూరు వాషింగ్టన్‌ సుందర్‌(30) ఔటయ్యాడు. తొలి బంతికి అతడు భారీ సిక్స్‌ కొట్టగా తర్వాతి బంతికే అగర్వాల్‌ చేతికి చిక్కాడు. దీంతో 16 ఓవర్లకు బెంళూరు 102/8తో నిలిచింది.

వికెట్ నెంబర్ 9..10..

బెంగళూరు 109 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్‌ వేసిన 17వ ఓవర్‌లో బెంగళూరు చివరి రెండు వికెట్లు కోల్పోయి 97 పరుగులతో తన పరాజయాన్ని పరిపూర్ణం చేసుకుంది 

Tags:    

Similar News