IPL 2021 KKR vs CSK: రసవత్తర పోరులో నెగ్గిన చెన్నై
IPL 2021 KKR vs CSK: రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 18 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది.
IPL 2021 KKR vs CSK: ముంబై వేదికగా జరిగిన బుధవారం రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 18 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ఓడినా కోల్‌కతా అద్భుత పోరాటం అందరినీ ఆకట్టుకుంది. 34 బంతుల్లో 66 పరుగుల ప్యాట్ కమిన్స్.. సూపర్ ఇన్నింగ్స్ వృథా అయింది. దీపక్ చాహర్ నాలుగు, ఎంగిడి మూడు వికెట్లతో సత్తా చాటారు. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. చాహర్ బౌలింగ్‌లో ఎంగిడి క్యాచ్ పట్టడంతో గిల్ పెవిలియన్ బాటపట్టక తప్పలేదు. ఆ తర్వాత కేకేఆర్ స్టార్ బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణాను(12 బంతుల్లో 9; 2 ఫోర్లు) కూడా ఔట్ చేసి కేకేఆర్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు చాహర్.
ఆ తర్వాత తాను వేసిన మూడో ఓవర్ లో కీలకమైన మోర్గాన్(7 బంతుల్లో 7; ఫోర్) వికెట్‌ను తీసి కేకేఆర్‌ను చావుదెబ్బ కొట్టాడు దీపక్ . చాహర్ వేసిన 5వ ఓవర్ ఆఖరి బంతికి నరైన్(3 బంతుల్లో 4; ఫోర్) కూడా పెవిలియన్ బాట పట్టడంతో చాహర్ సీజన్‌లో రెండో సారి నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఎంగిడి బౌలింగ్‌లో ధోని ముచ్చటగా మూడో క్యాచ్ అందుకోవడంతో కేకేఆర్ 31 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌ను దాదాపు చేజార్చుకుంది. అయితే.. రస్సెల్, కార్తీక్, ప్యాట్ కమిన్ ఐడియాలు వేరేలా ఉండటంతో పరుగుల వరద పారింది. కేకేఆర్ గెలుపుపై దాదాపు ఆశలు వదులుకున్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చి సిక్సర్ల సునామీ సృష్టించిన డేంజర్ మ్యాన్ అండ్రీ రసెల్(22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్సర్లు)... సామ్ కర్రన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత కార్తీక్ కూడా 24 బంతుల్లో 40 పరుగులు చేసి ఎంగిడి బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే, అక్కడే ప్యాట్ కమిన్స్ షో మొదలైంది. సూపర్ బ్యాటింగ్ తో రెచ్చి పోయాడు ఈ ఆస్ట్రేలియన్. సామ్ కర్రన్ వేసిన 16 వ ఓవర్ లో ఏకంగా మూడు పరుగులు పిండుకున్నాడు. అతని దెబ్బకి సామ్ కర్రన్ ముఖం చిన్నబోయింది. ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో ఇద్దరూ బ్యాట్స్ మెన్ రనౌట్లు అవ్వడంతో చెన్నై విక్టరీ కొట్టింది.