అమెరికా నుండి ఇప్పుడే వెళ్లిపోండి... లేదంటే - విదేశీయులకు ట్రంప్ సర్కార్ వార్నింగ్

Update: 2025-04-13 12:15 GMT
అమెరికా నుండి ఇప్పుడే వెళ్లిపోండి... లేదంటే - విదేశీయులకు ట్రంప్ సర్కార్ వార్నింగ్
  • whatsapp icon

Donald Trump's warning to illegal immirants in US : అమెరికాలో ఉండే విదేశీయులకు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ షాక్స్ మీద షాక్స్ ఇస్తున్నారు. అమెరికా వెళ్లే విదేశీయులు ఎవరైనా సరే నెల రోజులకు మించి అక్కడ ఉండాలనుకుంటే, ముందుగా అక్కడి ప్రభుత్వానికి ఆ సమాచారం అందించాల్సి ఉంటుంది. తమ పేరు, ఇతర వివరాలు అమెరికా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వారిపై భారీగా జరిమానాలు విధించడంతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తాజాగా అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ డిపార్ట్‌మెంట్ ఈ ఆదేశాలు జారీచేసింది. తమ ఆదేశాలు అనుసరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ విభాగం స్పష్టంచేసింది.

నెల రోజులకు పైగా అమెరికాలో ఉన్న విదేశీయులు వారంతట వారుగా వెళ్లిపోతే పర్వాలేదు. లేదంటే ప్రభుత్వమే బలవంతంగా డిపోర్ట్ చేస్తుంది అని అమెరికా ఎక్స్ ద్వారా స్పష్టంచేసింది. అంతేకాకుండా సొంతంగా వెళ్లిపోవడం వల్ల ఉన్న లాభాలు, వెళ్లకపోవడం వల్ల కలిగే నష్టాలను కూడా ఈ పోస్టులో పేర్కొంది.

అక్రమవలసదారులు సొంతంగా వెళ్లిపోతే కలిగే లాభాలు :

సౌకర్యవంతంగా వెళ్లిపోవచ్చు :

షరతులు లేకుండా మీకు మీరే ఒక ఫ్లైట్ బుక్ చేసుకుని సౌకర్యవంతంగా వెళ్లిపోయేందుకు అవకాశం ఉంటుంది.

మీ డాలర్లు మీవే :

అమెరికాలో ఇప్పటివరకు సంపాదించిన డబ్బులను వెంట తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

మళ్లీ ఎప్పుడైనా రావొచ్చు :

భవిష్యత్ లో మళ్లీ ఎప్పుడైనా అమెరికా రావాలనుకుంటే వీసా ప్రాసెస్ ఈజీ అవుతుంది. అలా కాకుండా ప్రభుత్వమే పంపించే వరకు వేచిచూస్తే భవిష్యత్ లో అమెరికాకు రావడంలో ఇబ్బందులు తప్పవు.

ఫ్లైట్ టికెట్‌పై సబ్సీడీ :

ఫ్లైట్ బుక్ చేసుకునేంత ఆర్థిక స్తోమత లేని వారికి ఫ్లైట్ టికెట్‌పై సబ్సీడీ ఇవ్వడం జరుగుతుంది.

నెల రోజులు దాటినా వెళ్లని వారు ఎదుర్కునే పరిణామాలు :

అరెస్ట్ చేస్తారు :

అమెరికా ప్రభుత్వం చెప్పినట్లుగా వినని వారిని హోమ్ ల్యాండ్ సెక్యురిటీ డిపార్ట్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. ఆ తరువాత వారు అమెరికా నుండి వెళ్లిపోయే ముందుగా ఏ పనులు చక్కబెట్టుకునే అవకాశం ఉండదు.

రోజుకు 998 డాలర్లు జరిమానా :

అమెరికా ప్రభుత్వం నుండి ఫైనల్ ఆర్డర్ వచ్చిన తరువాత కూడా దేశం విడిచివెళ్లని వారికి రోజుకు 998 డాలర్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలా ఎన్ని రోజులు అమెరికాలో ఉంటే అన్ని డాలర్ల జరిమానా.

అదనపు జరిమానా :

ప్రభుత్వం చెప్పిన తరువాత కూడా వెళ్లని వారికి అదనంగా 1000 నుండి 5000 డాలర్ల వరకు జరిమానా తప్పదు.

జైలు శిక్ష :

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దేశంలో ఉన్నందుకు జైలు శిక్ష విధించే అవకాశం.

అమెరికాలోకి ఇక నో ఎంట్రీ :

ఈ విషయంలో మీరు తప్పు చేశారని ఒక్కసారి అమెరికా ప్రభుత్వం గుర్తించిందంటే, ఆ తరువాత భవిష్యత్ లో మళ్లీ సక్రమ పద్ధతుల్లో అమెరికా రావాలన్న కూడా అనుమతి ఉండదు.  

ఈ 30 రోజుల వార్నింగ్ ఎవరెవరికి వర్తిస్తుంది ?

అమెరికాలో అక్రమవలసదారులకు అందరికీ డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ వర్తిస్తుంది. అక్రమవలసదారులు అంటే "కేవలం అక్రమ పద్ధతిలో అమెరికా వెళ్లిన వారు మాత్రమే" అని కాదు... అధికారికంగానే అమెరికా వెళ్లినప్పటికీ, తమ వీసా గడువు ముగిసిన తరువాత ఇంకా దేశం విడిచి వెళ్లిపోకుండా అక్కడే ఉంటున్న వారు కూడా అమెరికా ప్రభుత్వం దృష్టిలో అక్రమవలసదారులు కిందకే వస్తారు. ఈ విషయాన్ని అమెరికా గతంలో మాస్ డిపోర్టేషన్ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడే తేల్చిచెప్పింది.  

Tags:    

Similar News