పదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం,
అప్పీల్ దాఖలుతో వచ్చెను మళ్ళి పయనం,
సుప్రీంకోర్టు తాజాగా అంగీకరించడంతో కేసులో చలనం,
ఎవరి పాపమో, అమాయక ఆడపిల్ల ఆరుషి మరణం. శ్రీ.కో
పదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు రాజేశ్, నుపూర్ తల్వార్ నిర్దోషులుగా విడుదలయ్యారు. అయితే వీరి విడుదలను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తాజాగా అంగీకరించడంతో ఆరుషి హత్యకేసు మరోసారి తెర మీదకు వచ్చింది. ఆరుషి తల్వార్ హత్య కేసులో సీబీఐ అప్పీల్‌ను అంగీకరించినట్లు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజేశ్, నుపూర్ విడుదలపై ఆరుషి ఇంటి పనిమనిషి హేమరాజ్ భార్య కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌తో పాటే సీబీఐ అప్పీల్‌ను కూడా విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. 14ఏళ్ల ఆరుషి 2008 మే నెలలో దారుణ హత్యకు గురైంది. నోయిడాలోని తన నివాసంలోనే ఆరుషి విగతజీవిగా కన్పించింది. ఆమె గొంతు కోసి హత్య చేశారు. ఆరుషి చనిపోయిన నాటి నుంచి వారి ఇంట్లో పనిచేసే హేమరాజ్ కన్పించలేదు. దీంతో తొలుత పోలీసులు అతన్నే అనుమానించారు. అయితే ఆరుషి హత్య జరిగిన మరుసటిరోజే హేమరాజ్ కూడా శవమై కన్పించాడు. ఆరుషి ఇంటి టెర్రస్‌పైనే హేమరాజ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.