నిన్నటి వరకు ఉపాధికి కేరాఫ్ అడ్రగ్ మారిన ఐటీ జాబ్ మార్కెట్‌కి ముప్పు ముంచుకొస్తోంది.. అదే ఆటోమేషన్. ఐటీ రంగంలో ఆటోమేషన్ దెబ్బకు 2021 నాటికి 6.4 లక్షల ఉద్యోగాలు గాయబ్ కానున్నాయి. ఇటీవల ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గడంతో ఐటీ కంపెనీలు ఆటోమేషన్ బాటపడుతున్నాయి. దీని ఎఫెక్ట్ ఐటీ ఉద్యోగాలపై పడనుందని అమెరికాకు చెందిన హెచ్‌ఎఫ్ఎస్ రీసెర్చ్ వెల్లడించింది.
దేశంలో 32 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ సాఫ్ట్ వేర్ ఎగుమతుల ద్వారా భారీగా విదేశీ మారక ద్రవాన్ని ఆర్జించి పెడుతోంది ఐటీ రంగం. ఈ మధ్య పరిస్థితులు మారాయి. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీల లాభాదాయకత గణనీయంగా తగ్గింది. ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గటంతో కంపెనీలు వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవటంపై దృష్టి పెట్టాయి. హ్యూమన్ ఇంటలిజెన్స్ పెద్దగా అవసరంలేని పనులు , రొటీన్‌గా చేసుకుంటే పోయే పనులకు ఆటోమేషన్‌ను ఉపయోగిస్తున్నాయి. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్, టెస్టింగ్ లాంటి వాటి కోసం ఆటోమేషన్ టూల్స్‌ను వాడుతున్నాయి.. దానితో అలాంటి పనుల్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఆటోమేషన్ ప్రభావం వల్ల 20శాతం వరకు ఉద్యోగాలు తగ్గొచ్చని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్్వేర్ అండ్ సర్వీసెస్ అంచనా వేస్తోంది. ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో దేశీయ ఐటి సేవల పరిశ్రమలో 6.4 లక్షల ఉద్యోగాలు గల్లంతు కానున్నాయని అమెరికాకు చెందిన HFSరీసెర్చ్ లో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 2021 నాటికి ఆటోమేషన్ కారణంగా ఐటిలో స్కిల్డ్ ఉద్యోగాల సంఖ్య సుమారు 9 శాతం క్షీణిస్తుందని అంచనా వేసింది. ఫిలిప్పీన్స్, యుఎస్, యుకెల్లో కూడా ఇప్పటికే ఆటోమేషన్ ప్రభావం కనిపిస్తోందని వెల్లడించింది.
ఆటోమేషన్ ప్రకంపనలు ఇప్పటికే దేశీ ఐటి పరిశ్రమలోను మొదలయ్యాయి. గడిచిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా ఉద్యోగుల సంఖ్య ఆటోమేషన్ వల్ల రెండు వేలకు పైగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం అత్యధికంగా 90వేల మందిని రిక్రూట్ చేసుకున్న టిసిఎస్ సైతం ఈ ఏడాది తక్కువ మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు తెలిపింది. యాక్సెంచర్ సైతం న్యూ రిక్రూట్‌మెంట్స్‌ను తగ్గించింది. ప్రస్తుతం కంపెనీలు 90 శాతం వ్యయాన్ని సాంప్రదాయ ఐటి టెక్నాలజీ కోసం వెచ్చిస్తుండగా.. 2025 నాటికి 60 శాతాన్ని డిజిటల్ టెక్నాలజీల కోసం 40 శాతాన్ని సాంప్రదాయ ఐటి టెక్నాలజీ కోసం వెచ్చిస్తాయని ప్రముఖ ఐటి కన్సల్టింగ్ సంస్థ గార్ట్‌నర్ అంచనా వేసింది. అంతేకాక కొత్తగా వస్తోన్న ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి కాన్సెప్ట్స్, ఐటి రంగ ముఖ చిత్రాన్ని మరింత మార్చివేయనున్నాయి. వీటి రాకతో మాన్యూవల్ వర్క్ ఫోర్స్ స్థానంలో మిషన్స్ వినియోగం భారీగా పెరిగే అవకాశం వుంది. ప్రధానంగా బ్యాక్ ఆఫీస్, ఐటి సపోర్ట్ వర్క్ రంగాలపై ఆటోమేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో మీడియం స్కిల్డ్ ఉద్యోగాలు 8 శాతం మేర, హై స్కిల్డ్ ఉద్యోగాలు మాత్రం భారీగా మేర పెరుగుతాయని ...మిడ్, హై స్కిల్డ్ స్థాయిలో దాదాపు 1.6 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని హెచ్‌ఎఫ్ఎస్ రీసెర్చ్ తెలిపింది.
అయితే ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పోతాయని ఇప్పుడే చెప్పడం సబబు కాదంటోంది నాస్కామ్. భారత ఐటి రంగంపై ఉద్యోగాలపై ఈ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని నాస్కామ్ అభిప్రాయపడింది. కొత్త టెక్నాలజీలతో ఇతర రంగాల్లో భారీ ఎత్తున ఉద్యోగాల సృష్టి జరగనుందని భరోసా ఇస్తోంది.