కుస్తీ వీరుడు భజరంగ్ పునియా కుమ్మేసాడు,
ఆసియా క్రీడా దునియాలో కమ్మెసాడు,
మన భజరంగ్ భలేగా పసిడి పట్టు పట్టేసాడు,
ప్రత్యర్ధి టకాటని డైచి (జపాన్)ని ఓడించేసాడు. శ్రీ.కో.
ఆసియా క్రీడల్లో భారత్ పసిడి బోణీ కొట్టింది. కుస్తీ వీరుడు భజరంగ్ పునియా అద్బుత ప్రదర్శనతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో భజరంగ్ 11-8తో టకాటని డైచి (జపాన్)ని ఓడించాడు. ఫైనల్ ఆరంభం నుంచే భజరంగ్ దూకుడుగా ఆడాడు. పోటీ మొదలైన నిమిషంలోనే ప్రత్యర్థిని పట్టేసిన భజరంగ్ 6-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే డైచి ఎదురుదాడికి దిగాడు. భజరంగ్‌ను తెలివిగా మ్యాట్ మీద పడేసి 4 పాయింట్లు సాధించాడు. తొలి రౌండ్ ఆఖరికి భజరంగ్ 6-4తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత డైచి మరోసారి ప్రత్యర్థిని పట్టేయడంతో స్కోరు 6-6తో సమమైంది. పోటీ ముగియడానికి సరిగ్గా 100 సెకన్లు ఉండగా.. భజరంగ్ పుంజుకున్నాడు. ప్రత్యర్థి అంత సులభంగా చిక్కకపోయినా, ఎలాగోలా దొరకబుచ్చుకున్న అతను 8-6తో ఆధిక్యంలోకి వెళ్లడమే కాదు.. మరోసారి డైచిని పట్టేసి 10-8తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత రక్షణాత్మకంగా ఆడిన భజరంగ్ సాంకేతికంగా మరో పాయింట్ గెలిచి 11-8తో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.