Gold Price: ఒకప్పుడు తులం బంగారం ధర రూ. 64.. ఇప్పుడు 90 వేలకు ఎలా పెరిగింది?
Reasons behind gold price hike in India: బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. కానీ 5 ప్రధాన కారణాలు మాత్రం ఇలా...

Gold Price: రూ. 64 నుంచి 90 వేల దాకా సూపర్ ఫాస్ట్ గోల్డ్ ఎక్స్‌ప్రెస్
హోళీ పండుగ రోజు బంగారం ధర కొత్త రికార్డు సృష్టించింది. తులం బంగారం 90 వేల రూపాయలు టచ్ అయింది. అమ్మో హమ్మో అనుకుంటుండగానే బంగారం ధర 50 నుంచి 60... 70, 80 వేలు దాటి 90 వేలకు చేరుకుంది. ఇక లక్ష మార్క్ దాటడానికి కూడా ఎంతో టైమ్ పట్టేలా లేదు.
ఇంతకీ బంగారం ధరలు ఇలా పెరిగిపోవడానికి కారణాలేంటి? ఒకప్పుడు కేవలం 64 రూపాయలు ఉన్న బంగారం ధర ఇప్పుడెందుకు లక్ష రూపాయలకు దగ్గరగా వచ్చింది? ఈ గోల్డ్ ఎక్స్ ప్రెస్ ఇంకా ఎంతలా దూసుకుపోతుంది? అసలు తగ్గేదే లేదా? మరో పదేళ్ళు గడిస్తే పరిస్థితి ఏంటి? ఇదీ నేటి ట్రెండింగ్ స్టోరీ.
బంగార ధర పరుగులు పెడుతోంది. పేద, మధ్య తరగతి వర్గాలకు చిక్కకుండా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతోంది. తులం బంగారం లక్ష దాటే రోజు ఇంకెంతో దూరంలో లేదు. అంతేకాదు, దీని ధర త్వరలోనే లక్షా 40 వేల రూపాయలు దాటుతుందని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి.
బంగారు ధరల హోలీ...
మార్చి 14న హోలీ సందర్భంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1200 పెరిగి మొత్తంగా 89,780 రూపాయలకు చేరుకుంది. అంటే 90 వేలకు ఇంకో 220 రూపాయలే తక్కువ అన్నమాట.
ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర విషయానికొస్తే... ఇది 1100 రూపాయలు పెరిగి మొత్తంగా 82,300 రూపాయలకు చేరుకుంది.
ఇక నాణ్యతలో మూడో స్థానంలో ఉండే 18 క్యారెట్ల బంగారం ధర రూ.900 పెరిగి తులం 67,340 రూపాయలు పలుకుతోంది.
రూ. 64 నుండి 90,000 వరకు ఎలా పెరిగింది?
1964 లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం తులానికి జస్ట్ 63 రూపాయల 25 పైసలు మాత్రమే ఉండేది. అది ఆ ఏడాది సగటు ధర. స్వాతంత్య్రానికి ముందు వరకు బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవు. 1950 ల వరకు బంగారం ధర 50 రూపాయలకు కాస్త అటుఇటుగానే ఉండేది. అయితే, 1965, 1970 ల తరువాత బంగారం ధర పెరగడం మొదలైంది.
1965 లో 71 రూపాయల 75 పైసలుగా ఉన్న బంగారం ధర 1990 ల నాటికి 3200 రూపాయలకు పెరిగింది. 1962లో ఇండో-చైనా వార్, ఆ తరువాత వెంటనే 1965-71 మధ్య ఇండియా - పాకిస్తాన్‌ల యద్ధం తరువాత దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైంది. అప్పటి నుండే బంగారం ధరలు అమాంతం పెరగడం కనిపించింది.
1990 నుండి 2000 వరకు బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఆ పదేళ్లలో తులం బంగారం ధర కేవలం 1200 మాత్రమే పెరిగింది. కానీ బంగారం ధరలకు ఆ తరువాతే రెక్కలు మొలిచాయి.
గోల్డ్ జోరు ఎప్పుడు మొదలైంది...
2000 ల సంవత్సంలో రూ. 4200 గా ఉన్న బంగారం ధర 2010 నాటికి రూ. 18,500 లకు పెరిగింది. ఆ తరువాత మరో ఐదేళ్ల పాటు... అంటే 2015 వరకు 26,300 మాత్రమే పలికిన బంగారం ధర ఆ తరువాత అమాంతం కొండెక్కింది. 2020 లో రూ. 48,650 కు చేరింది. ఆ టైమ్ లో బంగారం ధర అంతగా పెరగడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటో కూడా తెలుసుకుందాం.
ఐదేళ్ల క్రితం తులం బంగారం ధర రూ. 48000 పెరగడం చూసిన జనం బెంబేలెత్తిపోయారు. బంగారం ఇంతకంటే ఎక్కువ ఇంకేం పెరుగుతుందా అని ఇంకొందరు అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఈ ఐదేళ్లలో బంగారం ధర దాదాపు డబల్ అయిపోయింది. రెండేళ్ల క్రితం కూడా 65,000 గా బంగారం ధర ఇప్పుడు 90,000 లకు చేరుకుంది.
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. కానీ నాలుగు ప్రధాన కారణాలు మాత్రం బంగారం ధరలపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1) పాపం.. రూపాయి!
డాలర్ విలువ భారీగా పెరిగి, రూపాయి విలువ దారుణంగా పడిపోవడం గోల్డ్ రేట్లు పెరగడానికి ఒక ముఖ్య కారణం. 1990 లో భారతీయ కరెన్సీలో ఒక అమెరికా డాలర్ విలువ 17 రూపాయలే. కానీ ఇప్పుడది 87 రూపాయలకు.
2) అంతర్జాతీయ మార్కెట్
అంతర్జాతీయ మార్కెట్లో బంగారాన్ని ట్రాయ్ ఔన్స్‌తో కొలుస్తారు. ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం 31 గ్రాముల 1 మిల్లీ గ్రాముకు సమానం. అంటే 3 తులాలకన్నా ఒక గ్రాము ఎక్కువే ఉంటుంది. అక్కడ ఔన్స్ బంగారం ధర పెరిగే కొద్ది ఇక్కడ ఇండియాలో బంగారం ధర పెరుగుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతోంది.
3) వడ్డీ రేట్లు పడిపోతే బంగారం పెరుగుతుంది
ప్రజలు పొదుపు చేసే సొమ్ము మీద వడ్డీ రేటు తగ్గితే... ఫిక్సెడ్ డిపాజిట్ రేట్లు పడిపోతే ఆ ప్రభావం బంగారం మీద పడుతుంది. సేవింగ్స్ మీద రాబడి తగ్గడం వల్ల బంగారం ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్ గా మారుతుంది. బంగారం ధర పెరగడానికి ఇదొక కారణం.
2014 లో బంగారం ధర అంత భారీగా పెరగడానిరి ఒక ప్రత్యేక కారణం ఉందని అనుకున్నాం కదా. అదేంటంటే, 2014లో రష్యా, యుక్రెయిన్ ల మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు యుక్రెయిన్ భూభాగమైన క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత కూడా సైబర్ వార్ కొనసాగింది. ఆ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బడా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి బంగారం వైపు మళ్లారు. ఆ ప్రభావం ఇండియాలో కూడా తీవ్రంగా కనిపించింది. అది దేశంలో ఉన్న ఫళంగా బంగారం ధర పైపైకి ఎగబాకేలా చేసింది.
4) మెగా మ్యారేజ్ కల్చర్...
దేశంలో పెళ్ళిళ్ళు కోట్ల రూపాయల ఈవెంట్స్ గా మారిపోయాయి. దాంతో, రిచ్, నియో రిచ్ క్లాస్ బంగారాన్ని ఎక్కువగా కొనడం మొదలైంది. ఈ డిమాండ్ గ్రోత్ కూడా బంగారం ధరలను ఆకాశంలోకి తరిమేస్తోంది.
5) బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా?
క్లియర్ ట్యాక్స్ అనే ఫైనాన్స్ కన్సల్టెన్సీ వెల్లడించిన ఒక సర్వే ప్రకారం రాబోయే పదేళ్లలో బంగారం ధరలు మరింతగా పెరుగుతాయి. 2034 నాటికి తులం బంగారం ధర రూ.1,41,443 వరకు వెళ్తుందని ఆ సర్వే చెబుతోంది. కానీ, ఇటీవలి రెండు మూడేళ్ళలో బంగారం ధరలు పెరిగిన వేగం చూస్తుంటే లక్షన్నర కావడానికి అంత సమయం కూడా పట్టకపోవచ్చేమో అనిపిస్తోంది. ఏది ఏమైనా... ఇప్పుడ గోల్డ్ ఈజ్ ఎ గోల్డెన్ ఇన్వెస్ట్‌మెంట్.