ATM Charges: పదేపదే డబ్బులు డ్రా చేస్తుంటారా? ఐతే ఈ న్యూస్ మీ కోసమే
ATM withdrawal charges: ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసే సేవలతో పాటు బ్యాలెన్స్ చెకింగ్ సేవలకు చార్జీలు

ATM Charges: ఏటీఎంలో పదేపదే డబ్బులు డ్రా చేస్తుంటారా? ఐతే ఈ న్యూస్ మీ కోసమే
ATM Charges increasing: ఏటీఎం కార్డుతో తరచుగా డబ్బులు డ్రా చేసే వారికి బ్యాడ్ న్యూస్. ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసే సేవలతో పాటు బ్యాలెన్స్ చెక్ చేసుకునే సేవలకు చార్జీలు పెరుగుతున్నాయి. క్యాష్ విత్‌డ్రా చేసే వారికి ఇప్పటివరకు బ్యాంకులు ఒక్కో లావాదేవీకి రూ. 17 వరకు చార్జ్ చేస్తున్నాయి. ఈ చార్జీలను ఇకపై రూ. 19 కి పెంచారు.
ఏటీఎం సెంటర్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకునే వారికి ఒక్కొక్క చెకింగ్‌కు రూ. 6 చార్జ్ చేస్తున్నారు. కానీ ఇకపై ఈ చార్జీలను రూ. 7 కు పెంచారు. పెరిగిన చార్జీలు మే 1వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి.
కొన్ని సందర్భాల్లో ఏటీఎం సేవలు పొందేవారికి ఇది పెద్ద మొత్తంలో అనిపించకపోవచ్చు. కానీ నిత్యం కొన్ని వేలు, లక్షల సంఖ్యలో లావాదేవీలు జరిగే బ్యాంకులకు మాత్రం ఆదాయం పెంచే మార్గం కానుంది.
డిజిటల్ పేమెంట్స్‌ను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫార్సుల మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుమతితో ఈ చార్జిల పెంపు జరిగింది.
ప్రతీ బ్యాంకు తమ కస్టమర్లకు ప్రతీ నెల పరిమిత సంఖ్యలో ఉచిత ఏటీఎం సేవలు అందిస్తున్నాయి. నాన్-మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోని ఏటీఎం కేంద్రాల్లో ప్రతీ నెల మూడుసార్లు ఉచిత లావాదేవీలు చేసుకునేందుకు వీలు ఉంది. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోని ఏటీఎం కేంద్రాల్లో నెలకు 5 సార్లు ఉచిత లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఉచిత సేవల లిమిట్ తరువాత చేసే ట్రాన్సాక్షన్స్‌కు చార్జీల పెంపు వర్తించనుంది.
చార్జిల పెంపునకు కారణం ఏంటంటే...
ఏటీఎం సేవలను అందించే విషయంలో ఇతర బ్యాంకులకు చెల్లించే ఇంటర్ చేంజ్ చార్జీలు పెరిగాయి. ఆ చార్జీల పెంపు ప్రభావం బ్యాంకులపై పడకుండా కస్టమర్లకు బదిలీ చేసే ప్రణాళికల్లో భాగంగానే ఎన్సీపీఐ ఈ సిఫార్సులు చేసింది. అలా బ్యాంకులకు ఏటీఎం సేవల చార్జీలు పెంచుకునేందుకు ఆర్బీఐ నుండి అనుమతి లభించింది.
కొన్ని చిన్న చిన్న బ్యాంకులకు జాతీయ స్థాయిలో ఏటీఎం నెట్‌వర్క్ లేదు. పెద్ద బ్యాంకులకు ఉన్నంత భారీ సంఖ్యలో వాటికి ఏటీఎం కేంద్రాలు కూడా లేవు. అలాంటి చిన్న బ్యాంకులు సొంత ఏటీఎం కేంద్రాలపై కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల సేవలపై ఆధారపడి లావాదేవీలు నిర్వహిస్తుంటాయి. అలాంటి బ్యాంకులకు ఈ చార్జీల పెంపు భారం కానుంది.