అసలు రాత్రివేళ ఆకాశంలోని నక్షత్రాలు ఎందుకు మిలమిలా మెరుస్తుంటాయో మీకు తెలుసా! రాత్రిపూట నక్షత్రాలు స్థిరముగా కాక మినుకు మినుకు మంటూ మెరుస్తూఉంటాయి. చంద్రుడు స్పస్టము గా కనిపిస్తున్నప్పుడు నక్షత్రాలు మాత్రము మెరవడానికి కారణము అవి చంద్రుడుకన్నా దూరములో ఉండడమే . అయితే భూమి నుంచి చూసినప్పుడే వాటి మిలమిలలు కనిపిస్తాయి. అదే భూవాతావరణాన్ని దాటి అంతరిక్షం నుంచో లేక వాతావరణం లేని చంద్రుడి మీద నుంచో చూస్తే నక్షత్రాలు మెరవవు. అంటే నక్షత్రాల మెరుపులకు కారణం వాతావరణంలో జరిగే మార్పులే. ఎంతో దూరంలో ఉన్న నక్షత్రాల నుంచి వెలువడే కాంతి కిరణాలు మన కంటిని చేరుకోవడం వల్లనే అవి మనకు కనిపిస్తున్నాయనేది తెలిసిందే. అయితే ఈలోగా అవి మన భూమి వాతావరణంలోని అనేక పొరలను దాటుకుని రావలసి ఉంటుంది. ఈ వాతావరణ పొరలు వివిధ ఉష్ణోగ్రతలు కలిగి ఉండడమే కాకుండా అల్లకల్లోలమైన కదలికలు కలిగి ఉంటాయి. ఆ పొరల గుండా ప్రయాణించే కిరణాలు వికృతీకరణం చెందడంతో మన కంటికి మిలమిల లాడుతూ కనిపిస్తాయట.. శ్రీ.కో