డాల్ఫిన్లు నీటిలోనే ఆక్సిజన్ వున్నా కూడా గాలి కోసం బయటకు ఎందుకు వస్తాయో మీకు తెలుసా? చేపల్లాంటి పూర్తి స్థాయి జలచరాలు తమకుండే మొప్పల్లాంటి అవయవాల సాయంతో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌ను రక్తంలోకి వ్యాపనం చేసుకోగలవు. కప్పలు, కొన్ని రకాల ఉభయచరాలు గాలిలో ఉండే ఆక్సిజన్‌ను ముక్కు రంధ్రాల ద్వారా పీల్చుకోగలిగినా, చర్మపు పొరలోకి కూడా నీటిలోని ఆక్సిజన్‌ను సైతం కొంతలో కొంత సేకరించుకోగలవు. కానీ నీటిలోనే నివాసం ఉంటున్నా నీటిలోని ఆక్సిజన్‌ను గ్రహించలేని జలచరాలు డాల్ఫిన్ లాంటివి ఇంకా ఉన్నాయి. అవి నీటి పాములు, తాబేళ్లు, మొసళ్లు, సీల్స్, తిమింగలాలు లాంటి జీవులకు మొప్పలు ఉండవు. చర్మపు నిర్మాణం కూడా నీటిలోని ఆక్సిజన్‌ను తీసుకోగల స్థితిలో ఉండదు. వాటికి ఊపిరితిత్తులు, నాసికా రంధ్రాలు ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్‌ను ఊపిరి ద్వారా గ్రహించగలిగే శ్వాస వ్యవస్థ మాత్రమే వీటిలో ఉంటుంది. అందువల్లనే ఇలాంటివి సముద్రంలోనే ఉన్నా పదేపదే నీటి ఉపరితలం పైకంటా వచ్చి గాలిని వదిలి, కావలసినంత గాలిని పీల్చుకుని తిరిగి నీటిలోకి వెళ్లిపోతూ ఉంటాయట.శ్రీ.కో