Skoda Upcoming Cars: గ్లోబల్ ఎక్స్‌పో 2025.. 3 కొత్త కార్లను పరిచయం చేయనున్న స్కోడా
Skoda Upcoming Cars: ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 వచ్చే నెల 17వ తేదీ నుండి న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది.
Skoda Upcoming Cars: ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 వచ్చే నెల 17వ తేదీ నుండి న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ ఆటోమోటివ్ ఈవెంట్‌లో అనేక ప్రముఖ కార్లు, బైక్ తయారీదారులు తమ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో స్కోడా కూడా పలు మోడల్స్‌ను ఆవిష్కరించబోతోంది. అటువంటి రాబోయే 3 స్కోడా మోడల్స్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూ జనరేషన్ స్కోడా సూపర్బ్
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో స్కోడా తన ఫ్లాగ్‌షిప్ సెడాన్ సూపర్బ్ న్యూ జనరేషన్ కారును ఆవిష్కరించబోతోంది. కొత్త తరం అవసరాలకు తగినట్లుగా సరికొత్త హంగులతో రాబోతున్న న్యూ జనరేషన్ స్కోడా సూపర్బ్ కారు పవర్‌ట్రెయిన్‌గా 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కొత్త సూపర్బ్ భారతదేశంలో CBU పద్ధతిలో విక్రయిస్తుంది. CBU అంటే కంప్లీట్‌లీ బిల్ట్ అప్ అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఒక దేశంలోపార్ట్స్ తయారై, మరో దేశంలో అసెంబుల్ అవడం కాకుండా ఎక్కడైతే పార్ట్స్ తయారయ్యాయో అక్కడే పూర్తిగా అసెంబుల్ అవడం, ఆ తరువాతే ఆ కారును దిగుమతి చేసుకోవడం అన్నమాట.
స్కోడా కొడియాక్
మరోవైపు, స్కోడా తన మిడ్-సైజ్ SUV కోడియాక్‌ను కూడా అప్‌డేట్ చేయబోతోంది. రాబోయే ఆటో ఎక్స్‌పోలో కంపెనీ కొత్త కోడియాక్‌ని నమోదు చేయవచ్చు. ఒక వార్త ప్రకారం... ప్రస్తుత వెర్షన్‌తో పోలిస్తే ఇది కొంచెం పెద్దది, ఎక్కువ ప్రీమియం క్యాబిన్‌ను కలిగి ఉంటుంది. అయితే, కారు పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం లేదు.
స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్
స్కోడా ఆక్టావియా RS జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మొదటిసారిగా భారతీయ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. ఫోర్త్ జనరేషన్ ఆక్టేవియా RS 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ TSI పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 265bhp పవర్, 370Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.