Maruti Suzuki Dzire: అదిరిపోయే ఫీచర్లతో రానున్న కొత్త తరం మారుతి సుజుకి డిజైర్.. విడుదల ఎప్పుడంటే?
New Generation Maruti Suzuki Dzire: మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ సెడాన్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను నవంబర్ 11 న విడుదల చేయబోతోంది. ఫోర్త్ జనరేషన్ పేరుతో వస్తోన్న ఈ మారుతి సుజుకి డిజైర్ కారు కంపెనీకే చెందిన హ్యాచ్‌బ్యాక్ మారుతి స్విఫ్ట్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే దీని డిజైన్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ కారు సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్‌లతో రానుంది.
సెడాన్ కేవలం 5 వేరియంట్‌లో మాత్రమే విడుదల కానుంది. ఇందులో LXI, VXI, VXI(O), ZXI, ZXI+ ఉన్నాయి. అప్‌డేట్ చేసిన మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం, డిజైర్ ధర రూ. 6.57 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతోంది. ఇది సెడాన్ సెగ్మెంట్లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్‌లతో పోటీపడనుంది.
జనాదరణ పొందిన సెడాన్‌లో కొత్త Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్ దాని పవర్‌ట్రెయిన్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత మోడల్‌లో ఉన్న K12 ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో కొత్త స్విఫ్ట్‌లో కొత్త 1.2-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 82 హెచ్‌పీ పవర్, 112 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
గత మోడల్స్‌ను పోల్చి చూస్తే, ప్రస్తుత మోడల్ 90hp, 113Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 8hp, 1Nm తక్కువ. కొత్త స్విఫ్ట్ ట్రాన్స్‌మిషన్ కోసం ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది.