Royal Enfield 750: మరింత రాయల్‌గా డుగ్గు డుగ్గు బండి.. 750CC ఇంజన్‌తో వస్తుంది
Royal Enfield 750: కొత్త సంవత్సరం 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన లైనప్‌ను బలోపేతం చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ కొత్త 750CC ఇంజన్ మోటార్‌సైకిల్‌ను భారత్‌లో విడుదల చేయడానికి వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఇటీవలే కాంటినెంటల్ GT 750ని చెన్నై సమీపంలోని రోడ్లపై, దక్షిణ ఐరోపాలోని హిమాలయన్ 750ని టెస్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇంటర్‌సెప్టర్ 750ని పరీక్షిస్తోంది. ఇక ఇప్పుడు ఈ కొత్త బైక్ ఫీచర్లను తెలుసుకుందాం.
స్పై షాట్స్ ద్వారా అందిన సమాచారం ప్రకారం.. ఈ మోటార్‌సైకిల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా డెవలప్ చేసిన 750CC ఇంజన్‌తో వస్తోంది. ఈ పెద్ద ఇంజన్ ప్రస్తుతం ఉన్న 650CC మోడల్‌తో పోలిస్తే మెరుగైన పనితీరు, పెరిగిన పవర్, అధిక టార్క్‌ని అందించగలదని భావిస్తున్నారు. గేర్‌బాక్స్ 6-స్పీడ్ యూనిట్‌గా ఉంటుంది. అయితే బైక్ కొత్త డిజైన్‌కు అనుగుణంగా గేర్లు మారొచ్చు.
ఇప్పటికే ఉన్న ఇంటర్‌సెప్టర్ 650తో పోలిస్తే టెస్ట్ మోడల్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. కొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్, కొత్త టెయిల్‌లైట్లు, కాంపాక్ట్ ట్విన్ మఫ్లర్‌లు, ఇవి కాంటినెంటల్ GT 750 ప్రోటోటైప్‌ను పోలి ఉంటాయి. అదనంగా ఇది డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, సింగిల్-పాడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది హిమాలయన్ 450, గెరిల్లా 450, బేర్ 650 వంటి ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్‌లతో సమానంగా ఉంటుంది.
ఈ మార్పులు ఉన్నప్పటికీ, టెస్ట్ మోడల్ ఇంటర్‌సెప్టర్ 650 మొత్తం డిజైన్ కలిగి ఉంది. ఈ మోడల్ ప్రధానంగా కొత్త ఇంజిన్‌ను పరీక్షించడానికి ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. 750CC ఇంజన్‌లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మోటార్‌సైకిళ్ల గురించి మరిన్ని వివరాలు 2025 చివరి నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త లైనప్ కంపెనీ ప్రతిష్టను మరింత పటిష్టం చేస్తుందా అనేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.