Alert: వాహనదారులు అలర్ట్.. 8 ఏళ్లు దాటిన వాహనాలు రోడ్డెక్కాలంటే ఇది తప్పనిసరి..!
Alert: భద్రత, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023 నుంచి కొత్త నిబంధన అమలు చేయబోతోంది.
Alert: భద్రత, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023 నుంచి కొత్త నిబంధన అమలు చేయబోతోంది. దీని ప్రకారం 8 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలకు ప్రతి సంవత్సరం ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహించడం తప్పనిసరి చేసింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 2న దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ దీనిపై అభ్యంతరాలు, సూచనలను కోరింది. 8 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి ఉన్న ట్రక్కులు లేదా బస్సులు మొదలైనవి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. జాబితా చేయబడిన ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ స్టేషన్‌లో మాత్రమే ఈ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు.
ఒకవేళ ఫిట్‌నెస్ పరీక్ష లేకుండా రోడ్డెక్కిన వాహనాలకి భారీ జరిమానా విధిస్తారు. అంతేకాదు అలాంటి వాహనాలను రోడ్డుపైకి అనుమతించరు. ఇలాంటి వాహనాలు ఆయిల్ ఎక్కువగా వినియోగించడంతోపాటు పర్యావరణానికి హాని చేస్తున్నాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇలాంటి వాహనాలు ప్రమాదాలకు కారణమవుతాయి. వీటిని అరికట్టడం ద్వారా ప్రయాణికుల భద్రత పెరగడంతో పాటు పర్యావరణం మెరుగుపడుతుంది.
10 రాష్ట్రాల్లో సెంటర్లు
స్క్రాపేజ్ విధానం కోసం భారత ప్రభుత్వం 10 రాష్ట్రాల్లో ఫిట్‌నెస్ పరీక్ష హైటెక్ R&C కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం కేంద్రం 22 డిసెంబర్ 2021న నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ కేంద్రాల్లో ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల, ప్రైవేట్, వాణిజ్య వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్ష అనంతరం సర్టిఫికెట్లు అందజేసి ఈ వాహనాలపై ప్రత్యేక స్టిక్కర్లు వేస్తారు. పీయూసీ విచారణ ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించే వాహనం, దాని యజమానికి సంబంధించిన మొత్తం సమాచారం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఈ వెబ్‌సైట్ సెంట్రల్ డేటాకు లింక్ అయి ఉంటుంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి వాహనాల పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ బాడీ, ఛాసిస్, వీల్స్, టైర్లు, బ్రేకింగ్, స్టీరింగ్ వంటి అనేక భాగాలను లైట్లతో హైటెక్ యంత్రాల ద్వారా తనిఖీ చేస్తారు.