Telangana Budget 2024 Live Updates: తెలంగాణ బడ్జెట్ లైవ్‌ అప్‌డేట్స్‌.. రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ. 15 వేలు

Telangana Budget 2024 Live Updates: తెలంగాణ బడ్జెట్ లైవ్‌ అప్‌డేట్స్‌..
x

Telangana Budget 2024 Live Updates: తెలంగాణ బడ్జెట్ లైవ్‌ అప్‌డేట్స్‌..

Highlights

Telangana Budget 2024 Live Updates: తెలంగాణ బడ్జెట్ 2024-25 డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.

Telangana Budget Live Updates: మల్లు భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఆయన బడ్జెట్ పద్దును సమర్పించారు.

శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రూ.2,20,945 కోట్లు రెవిన్యూ వ్యయం,మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా బడ్జెట్ ప్రతిపాదించింది రేవంత్ రెడ్డి సర్కార్.


Show Full Article

Live Updates

  • 25 July 2024 8:50 AM GMT

    రైతులకు ఏం చేస్తారో చెప్పలేదు: బడ్జెట్ పై కేసీఆర్

    తెలంగాణ బడ్జెట్ పై బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. బడ్జెట్ ను చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని అర్ధమౌతుందని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం తర్వాత గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతుల కోసం రైతుబంధు కింద రైతులకు సాయం చేస్తే ఆ నిధులు దుర్వినియోగమైనట్టుగా తప్పుడు ప్రచారం చేశారన్నారు.

    రైతు బంధు కింద రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు సాకులు చెబుతుందని ఆయన విమర్శలు చేశారు. వ్యవసాయ, ఐటీ, పారిశ్రామిక పాలసీలపై స్పష్టైన విధానం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని కేసీఆర్ చెప్పారు.

  • 25 July 2024 8:33 AM GMT

    తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్

    రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయాలు. జాతీయ తలసరి ఆదాయం 1,83,236 రూపాయాలు, జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1,64,063 రూపాయాలు ఎక్కువగా ఉంది. ఆదాయంలో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం ఉంది. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 9.46.862 రూపాయాలు. వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం 1,80,241 రూపాయాలుగా నమోదైంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం విధానాలను రూపొందిస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం చెప్పారు.

  • 25 July 2024 8:29 AM GMT

    ధరణిపై కమిటి రిపోర్ట్ ఆధారంగా చర్యలు

    ధరణి పోర్టల్ తో సమస్యలపై అధ్యయనం చేయడానికి కమిటిని ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికి 3,49,514 మంది రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ధరఖాస్తులు చేశారు. ఇందులో 1,79,143 ధరఖాస్తులను పరిష్కరించినట్టుగా భట్టి విక్రమార్క చెప్పారు. ధరణిలో 35 లావాదేవీలకు సంబంధించిన మాడ్యూళ్లను, 10 సమాచార మాడ్యూళ్లను అందుబాటులోకి తెచ్చినట్టుగా ప్రభుత్వం వివరించింది. రాష్ట్ర బడ్జెట్ లో రూ. 72,659 కోట్లను ప్రతిపాదించినట్టుగా డిప్యూటీ సీఎం చెప్పారు.

  • 25 July 2024 8:21 AM GMT

    రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ. 15 వేలు

    అర్హులైన రైతులకు రైతుభరోసా అందించాలనే ఉద్దేశ్యంతో కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ కమిటీని అసెంబ్లీలో చర్చకు పెట్టి రైతు భరోసాను అమలు చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.ఈ పథకం కింద ప్రతి ఏటా రూ. 15 వేలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు కింద 80,440 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇందులో అనర్హులు, సాగులోలేని భూ యజమానులు, రియల్ ఏస్టేట్ వ్యాపారులకు నిధులు అందాయని భట్టి విమర్శించారు. భూమిలేని రైతు కూలీలకు ప్రతి ఏటా రూ. 12 వేలు చెల్లిస్తామన్నారు.

    సన్నరకం వరి సాగు చేసిన రైతులకు రూ. 500 బోనస్

    సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి వాటిని పండించేందుకు రైతుకు క్విటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. దీంతో సన్నరకాల వరిని సాగు చేసే భూమి విస్తీర్ణం పెరిగి రైతులకు ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది.

  • 25 July 2024 8:13 AM GMT

    విద్యా రంగానికి రూ.21,292 కోట్లు

    రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. డిఎస్సీ పూర్తైతే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు యూనివర్శిటీల్లో మౌలిక వసతుల కోసం రూ. 500 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. మహిళా విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులకు రూ.100 కోట్లు కేటాయించారు.

    65 ప్రభుత్వ ఐటీఐలను ప్రైవేట్ సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఆరు కొత్త కోర్సులను ప్రవేశ పెట్టారు.ప్రతి ఏటా 5,860 మంది విద్యార్థులు ప్రతి ఏటా ఈ కోర్సుల్లో శిక్షణ పొందుతారు. స్వల్పకాల కోర్సుల్లో ప్రతి ఏటా 31,200 మంది విద్యార్థులు శిక్షణ పొందుతారు. ఇందుకు అయ్యే ఖర్చు రూ.2,324 కోట్లు, ప్రభుత్వం రూ.307.95 కోట్లు. మిగిలిన మొత్తాన్ని టాటా సంస్థ సీఎస్ఆర్ నిధుల నుంచి సమకూరుస్తుంది. ఈ పథకానికి ఈ బడ్జెట్ లో రూ. 300 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

  • 25 July 2024 7:59 AM GMT

    కాళేశ్వరంపై కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు

    నీటి పారుదల రంగానికి ఈ బడ్జెట్ లో రూ,22,301 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం 24 భారీ, 7 మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని భట్టి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్ల లోపాలు, నాణ్యత లేకుండా నిర్మాణాలు చేయడంతో ఆ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టులో అవకతవకలను గుర్తించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా భట్టి విక్రమార్క చెప్పారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

  • 25 July 2024 7:47 AM GMT

    ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ప్రోత్సాహం

    ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హైద్రాబాద్ ను ఎఐలో అగ్రగ్రామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్టుగా భట్టి చెప్పారు. భవిష్యత్తులో ‎ఎఐ కంప్యూటర్ పరికరాలతో అత్యాధునిక కృత్రిమ మేధో పరిజ్ఞన పరిశోధక కేంద్రంగా రూపొందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. హైద్రాబాద్ లో ఈ ఏడాది సెప్టెంబర్ 5,6 తేదీల్లో ఎఐ మేధో శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన 2 వేల మంది హాజరు కానున్నారని ప్రభుత్వం తెలిపింది.

  • 25 July 2024 7:33 AM GMT

    ఇందిరా మహిళా శక్తి పథకం కింద రూ. 1లక్ష కోట్ల సాయం

    రాష్ట్రంలోని 63 లక్షల మహిళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం చేయడం ద్వారా రూ. 1లక్ష కోట్లను ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

    మహిళలకు ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా ఏటా 5 వేల గ్రామీణ సంఘాలకు, ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరేలా కార్యాచరణ చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది.

  • 25 July 2024 7:26 AM GMT

    ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సౌకర్యాలపై మొబైల్ యాప్

    విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 450 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లున్నాయి. అదనంగా గ్రేటర్ హైద్రాబాద్ లో 100 స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సౌకర్యాలను తెలుసుకొనేందుకు టీజీఈవీ మొబైల్ యాప్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం చెప్పారు.

    సౌరశక్తి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ట్రాన్స్, డిస్కంలకి ఈ బడ్జెట్ లో రూ. 16,410 కోట్లు ప్రతిపాదించింది రేవంత్ రెడ్డి సర్కార్. కొత్తగా 11 ఎక్స్ ట్రా హైటెన్షన్ సబ్ స్టేషన్ల నిర్మాణం, 31 ఎక్స్ ట్రా హై ఓల్టేజ్ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల సామర్ధ్య పెంపు కోసం రూ.3,107 కోట్లు కేటాయించినట్టుగా డిప్యూటీ సీఎం చెప్పారు.

  • 25 July 2024 7:17 AM GMT

    ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం

    ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 1672 చికిత్సలలో 1375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20 శాతానికి పెంచారు. అంతేకాదు ఇందులో 163 వ్యాధులను కొత్తగా చేర్చారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టుగా భట్టి విక్రమార్క చెప్పారు. త్వరలోనే ఈఎన్టీ ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు ఈ బడ్జెట్ లో రూ.11,468 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

Print Article
Next Story
More Stories