Top-6 News of the Day: అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మరో 5 ముఖ్యాంశాలు
Top-6 News of the Day (17/07/2024)
1. నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం: కుటుంబ సభ్యుల ఆందోళన
నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఈ నెల 15 నుంచి అదృశ్యమయ్యారు. మచిలీపట్టణం వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి వెళ్లిన ఎంపీడీఓ కన్పించకుండా వెళ్లారు. 16న నా పుట్టిన రోజు అదే రోజు నా చావు రోజు అంటూ ఎంపీడీఓ వెంకటరమణ తన భార్య ఫోన్ కు మేసేజ్ పెట్టారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటరమణ వాహనం బందరు రైల్వే స్టేషన్ లో గుర్తించారు.
2. అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
మద్యం పాలసీ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టవిరుద్దమని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 29న విచారణ చేపడుతామని కోర్టు తెలిపింది. ఈడీ కేసులో కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది.
3. నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ
నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఈ పండుగలో పాల్గొనేందుకు పలు ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేసి కోర్కెల రొట్టెలు పంచుకున్నారు. బారాషహీద్ దర్గా వద్ద భక్తులు తమ కోరికలు కోరుకుంటారు. కోరికలు నెరవేరినందుకు రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పండుగకు ప్రభుత్వం ఏర్పా్ట్లు చేసింది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
4. కువైట్ నుంచి స్వస్థలానికి చేరుకున్న కార్మికుడు శివ
కువైట్ లో కష్టాలపై కన్నీళ్లు పెట్టుకున్న శివ స్వస్థలానికి చేరుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవతో శివ స్వస్థలానికి చేరుకున్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ బృందానికి శివను స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యత అప్పగించారు. శివ బుధవారం మదనపల్లికి చేరుకున్నారు.
5. కర్ణాటకలో స్థానికులకు ఉద్యోగాల బిల్లుకు కేబినెట్ ఆమోదం
కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు తప్పనిసరి చేసింది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. మేనేజ్ మెంట్ ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్ మెంట్ ఉద్యోగాల్లో 70 శాతం స్థానికులకే ఇవ్వడం తప్పనిసరి చేసింది ఈ బిల్లు. అయితే ఈ బిల్లుపై పారిశ్రామికవర్గాల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది.
6. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంలో పోరాటం హరీష్ రావు
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు మాజీలుగా మారే వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంలో పిటిషన్ వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పటాన్ చెరు ఎమ్మెల్యే ఇటీవలనే కాంగ్రెస్ లో చేరారు. దీంతో బుధవారం పటాన్ చెరులో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న వాళ్లే కన్పించకుండా పోయారన్నారు.