Electricity Bill Scam: కరెంట్ బిల్ స్కాం.. కట్టారంటే ఖాతా మొత్తం ఖాళీ..!
Electricity Bill Scam: ఆన్‌లైన్ మోసాలకి కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది సైబర్ నేరస్థుల దాడులు.
Electricity Bill Scam: ఆన్‌లైన్ మోసాలకి కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది సైబర్ నేరస్థుల దాడులు. టెక్నాలజీ పెరగడంతో చాలామంది ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేస్తూ సమయం ఆదా చేసుకుంటున్నారు. కానీ ఇదే టెక్నాలజీని ఆసరాగా చేసుకొని సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. తాజాగా కరెంట్ బిల్ స్కాం మొదలుపెట్టారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు దొంగిలించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు తెలుసుకుందాం.
కరెంటు బిల్లు కట్టకపోతే కనెక్షన్ డిస్‌కనెక్ట్ చేస్తామని సెల్‌ఫోన్‌కి మెసేజ్ వచ్చిందా.. ఇలాంటి మెస్సేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదొక కొత్త స్కామ్. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ మోసానికి బలయ్యాడు. రామకృష్ణం రాజు అనే వ్యక్తిని రూ.1.85 లక్షలు మోసం చేశారు. మొదటగా ఆయనకి ఒక తెలియని నంబర్ నుంచి మెస్సేజ్ వచ్చింది. అందులో ఫిబ్రవరి కరెంటు బిల్లు బకాయి అని రాసి ఉంది. ఈ మెసేజ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిందని రాజు భావించి అక్కడ ఉన్న లింక్‌పై క్లిక్ చేశాడు.
వెంటనే ఒక వెబ్‌సైట్ యాక్సెస్ వచ్చింది. ఇక్కడ చెల్లింపు చేసే ఆప్షన్ వచ్చింది. దీనిని కొనసాగించి చెల్లింపు చేశాడు. అయితే చెల్లింపు రసీదు రాలేదు. ఆందోళన చెంది రాజు మెసేజ్ వచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు. స్కామర్ కాల్‌ను స్వీకరించి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పాడు. ఈలోపు ఆ స్కామర్ చాకచక్యంగా వారి బ్యాంకు వివరాలను తస్కరించాడు. వెంటనే అతడి ఖాతా నుంచి 1.8 లక్షలు డ్రా చేశాడు.
ఎలా సురక్షితంగా ఉండాలి
ఈ మోసగాళ్లతో పోలీసులు కూడా విసిగిపోయారు. ఇలాంటి మోసాల గురించి ప్రజల్లో అవగాహన పెరగాలి. తెలియని నెంబర్ నుంచి మెస్సేజ్ వచ్చి కింద ఉన్న బ్లూ లింక్‌పై క్లిక్ చేయాలని కోరితే అస్సలు చేయకూడదు. వీటి ఉద్దేశ్యం మీ బ్యాంక్ వివరాలను దొంగిలించడమే అని గుర్తించాలి.