Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్ పాల్గొనకపోతే.. పాకిస్థాన్ కూడా..

Update: 2024-11-09 17:15 GMT

Champions Trophy 2025: పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు సంబంధించి బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకోనుందా అనేదే ప్రస్తుతానికి ఉత్కంఠగా మారింది. ఇప్పటివరకు ఉన్న అప్‌డేట్స్ ప్రకారం భారత జట్టును పాకిస్థాన్ పంపించడానికి బీసీసీఐ సిద్ధంగా లేదు. ఈ విషయంలో ఇప్పటికే రకరకాల వార్తలొచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈవెంట్లో ఇండియా పాల్గొనాలనుకుంటే ఆ మ్యాచ్‌లు పాక్‌లో కాకుండా దుబాయ్‌లో జరిగే అవకాశం ఉందని కొన్ని వార్తలొచ్చాయి. ఒకవేళ పాకిస్థాన్‌కు వెళ్లి మ్యాచ్‌లు ఆడాలనుకున్నా.. మ్యాచ్‌లు అక్కడే ఆడిన తరువాత ఆటగాళ్లు అక్కడ బస చేయకుండా వెంటనే భారత్ తిరిగొచ్చే అవకాశం ఉందని ఇంకొన్ని వార్తలొచ్చాయి. అయితే, బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనంత వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే భావించాల్సి ఉంటుంది.

ఇక తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపించకపోతే.. పాకిస్థాన్ కూడా మరో పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పాక్ మాజీ కెప్టేన్ రషీద్ లతీఫ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇకపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసిసి నిర్వహించే ఏ ట్రోఫీలోనూ పాల్గొనేది లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకునే అవకాశం లేకపోలేదని రషీద్ లతీఫ్ చెప్పిట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లతీఫ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలొస్తున్నాయి.

లతీఫ్ జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. "ఒకవేళ ఏదైనా ఒక జట్టు ఐసిసి ఒప్పందాలపై సంతకం చేశాక..ఆ జట్టు ఈవెంట్లో పాల్గొనడం లేదని చెప్పడానికి ఏదైనా బలమైన కారణం కావాలి. కానీ టీమిండియా భద్రతే ప్రధాన సమస్య అనే కారణాన్ని చూపిస్తే అది సరికాదు. ఎందుకంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి జట్లు పాకిస్థాన్ రావాలని కోరుకుంటున్నాయి. అలాంటప్పుడు భద్రతే సమస్య అని ఎలా అంటారు" అని లతీఫ్ వ్యాఖ్యానించినట్లుగా ఎన్డీటీవీ కథనం పేర్కొంది. అంతేకాకుండా ఒకవేళ భారత్ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనకపోతే.. ఇకపై పాకిస్థాన్ కూడా ఐసిసి నిర్వహించే పోటీల్లో పాల్గొనబోదని లతీఫ్ చెప్పినట్లుగా ఆ కథనం పేర్కొంది.

ఐసిసి కొనసాగుతుందంటే దానికి కారణమే భారత్, పాకిస్థాన్ జట్లు. అలాంటప్పుడు పాకిస్థాన్ కూడా భారత్ బాటలోనే వెళ్తే ఇక ఐసిసి మ్యాచ్‌లను ఎవ్వరూ చూడరని, అప్పుడు ఐసిసి ఉండి కూడా లాభం ఉండదని రషీద్ లతీఫ్ వ్యాఖ్యానించినట్లుగా ఆ వార్తా కథనం స్పష్టంచేసింది. అంతేకాదు.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లను రద్దు చేసుకునే హక్కు భారత్‌కు ఉంది కానీ ఒకసారి సంతకం చేసిన తరువాత ఐసిసి మ్యాచ్ రద్దు చేసుకునే హక్కు భారత్‌కు లేదనేది లతీఫ్ వాదనగా తెలుస్తోంది. అయితే, మాజీ కెప్టేన్ హోదాలో రషీద్ లతీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుందేనే విషయంలోనే ప్రస్తుతానకి క్లారిటీ లేదు.

మరో కోణంలో ఆలోచిస్తే పాకిస్థాన్ తో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాలకు ఉన్న సంబంధాలు వేరు. ఆయా దేశాల మధ్య ఎలాంటి విబేధాలు లేవు. కానీ భారత్ విషయంలో వాస్తవ పరిస్థితి వేరు అనే విషయాన్ని రషీద్ లతీఫ్ అర్థం చేసుకోవడం లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. టీమిండియాను పాకిస్థాన్ పంపించకూడదని బీసీసీఐ గట్టిగా నిర్ణయించుకుంటే, బీసీసీఐ చెప్పే వాదన కూడా అదే కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News